Shiv Sena Office: లోక్‌సభలో శివసేన కార్యాలయం షిండే వర్గానికి కేటాయింపు

ABN , First Publish Date - 2023-02-21T14:08:30+05:30 IST

పార్లమెంటు హౌస్‌లోని శివసేన కార్యాలయాన్నిఏక్‌నాథ్ షిండే వర్గానికి కేటాయించారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్..

Shiv Sena Office: లోక్‌సభలో శివసేన కార్యాలయం షిండే వర్గానికి కేటాయింపు

న్యూఢిల్లీ: పార్లమెంటు హౌస్‌లోని శివసేన కార్యాలయాన్ని (Shiv Sena Office) ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) వర్గానికి కేటాయించారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ ఒక అధికారిక ప్రకటనను షేర్ చేసింది. ఆ ప్రకారం లోక్‌సభలోని 128వ నెంబర్ గదిని ఏక్‌నాథ్ షిండే క్యాంప్‌కు కేటాయించారు. మహారాష్ట్ర లెజిస్లేటివ్ బిల్డింగ్‌లోని పార్టీ కార్యాలయాన్ని షిండే వర్గం తమ అధీనంలోకి తీసుకున్న మరుసటి రోజే ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది. లెజిస్లేటివ్ బిల్డింగ్‌లోని పార్టీ కార్యాలయం ఇప్పటికి వరకూ శివసేన (UBT) అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే చేతిలో ఉండేది.

శివసేన పార్టీ పేరుతో పాటు 'విల్లు-బాణం' గుర్తును మహారాష్ట్ర శివసేన నేత ఏక్‌నాథ్ షిండే వర్గానికి ఎన్నికల కమిషన్ గత శుక్రవారంనాడు కేటాయిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసీ నిర్ణయాన్ని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సుప్రీంకోర్టులో సవాలు చేశారు. కేసును అత్యవసరంగా విచారించాలని ఉద్ధవ్ తరఫు న్యాయవాది అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై 22వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఉద్ధవ్ వర్గం తమ పిటిషన్‌లో మధ్యంతర ఉపశమనంగా ఈసీ ఉత్తర్వుపై స్టే విధించాలని కోరింది. తటస్థ మధ్యవర్తిగా తన బాధ్యతను నిర్వర్తించడంలో ఈసీ విఫలమైందని శివసేన (యూబీటీ) ఆరోపించింది. రాజ్యాంగ హోదాను దెబ్బతీసే విధింగా ఈసీ వ్యవహరించిందని వివరించింది.

కాగా, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున, శివసేన పార్టీ పేరు, గుర్తు కేటాయింపు వ్యవహారంపై తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని ఎన్నికల కమిషన్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఈసీ ఏమాత్రం పట్టించుకోలేదని ఉద్ధవ్ థాకరే మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఎన్నికల కమిషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ పేరు, గుర్తును తస్కరించారని, ఇలాగైతే 2024 తర్వాత దేశంలో ఎన్నికలే ఉండవని చెప్పారు. తన వర్గం శివసేన అధికారిక బ్యాంకు ఖాతాల నుంచి నిధులు బదిలీచేస్తోందన్న వార్తలను తిప్పికొడుతూ, పార్టీ నిధుల గురించి మాట్లాడే హక్కు ఈసీకి లేదన్నారు. ఈసీ సుల్తాన్‌లా వ్యవహరించరాదని, పార్టీ నిధుల పంపిణీ ఊసెత్తితే క్రిమినల్‌ కేసు పెడతామని హెచ్చరించారు.

Updated Date - 2023-02-21T14:08:32+05:30 IST