Mallikarjun Kharge Book launch: ఖర్గే రాజకీయ ప్రయాణంపై పుస్తకాన్ని ఆవిష్కరించిన సోనియాగాంధీ
ABN , First Publish Date - 2023-11-29T20:30:31+05:30 IST
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజకీయ ప్రయాణంపై రచించిన ''మల్లికార్జున్ ఖర్గే: పొలిటికల్ ఎంగేజ్‌మెంట్ విత్ కంపాషన్, జస్టిస్ అండ్ ఇన్‌క్లూజివ్ డవలప్‌మెంట్'' పుస్తకాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారంనాడిక్కడ అవిష్కరించారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) రాజకీయ ప్రయాణంపై రచించిన ''మల్లికార్జున్ ఖర్గే: పొలిటికల్ ఎంగేజ్‌మెంట్ విత్ కంపాషన్, జస్టిస్ అండ్ ఇన్‌క్లూజివ్ డవలప్‌మెంట్'' పుస్తకాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gadnhi) బుధవారంనాడిక్కడ అవిష్కరించారు. ఎన్నికల రాజకీయాల్లో ఖర్గే 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని పురష్కరించుకుని ఈ పుస్తకం విడుదలైంది. ఈ పుస్తకంలోని పలు ఛాప్టర్లను సోనియాగాంధీ, రామ్‌నాథ్ కోవింద్, మన్మోహన్ సింగ్, ఎం.వెంకయ్యనాయుడు, రాహుల్ గాంధీ, శరద్ పవార్ తదితర ప్రముఖులు రాశారు.
పుస్తకావిష్కరణ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ, తన గురించి ఈ పుస్తకంలో రాసిన ప్రతి ఒక్కరికీ తాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాని అన్నారు. తన నియోజకవర్గానికి, రాష్ట్రానికి, దేశానికి తాను ఏదైనా సేవచేయగలిగానంటే ఓటర్లు, పార్టీ నేతలు తనపై ఉంచిన నమ్మకమే కారణమని అన్నారు. ఎమ్మెల్యే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తనను ఎంపిక చేసినప్పుడు తన వయసు కేవలం 29 ఏళ్లని ఆయన చెప్పారు.
వ్యక్తిగత ప్రయోజనాలకు కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చే ఘనత ఖర్గేకు దక్కుతుందని సోనియాగాంధీ ప్రశంసించారు. తన సన్నిహితులు ఎంత పెద్దవారైనా, చిన్నవారైనా అందర్నీ కలుపుకుని వెళ్లే తత్వం ఆయనదని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి అనుసరిస్తున్న సిద్ధాంతాలను, రాజ్యంగబద్ధ సంస్థలను, వ్యవస్థలను అధికారంలో ఉన్న వారు విచ్ఛిన్నం చేస్తు్న్న ప్రస్తుత క్లిష్ట తరుణంలో పార్టీ అధ్యక్షుడిగా ఖర్గే పగ్గాలు చేపట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దిగ్గజనేతగా పార్టీకి సారథ్యం వహించేందుకు ఆయన సమర్ధులని శ్లాఘించారు.