Sonia, Priyanka: పాతికేళ్ల తరువాత.. మళ్లీ నగరానికి తల్లీకూతుళ్లు
ABN , First Publish Date - 2023-10-13T07:12:22+05:30 IST
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ(Sonia Gandhi), ఆమె కుమార్తె ప్రియాంక(Priyanka) పాతికేళ్ల తరువాత కలిసి నగరానికి రానున్నారు
- రేపు సోనియా, ప్రియాంక రాక
పెరంబూర్(చెన్నై): కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ(Sonia Gandhi), ఆమె కుమార్తె ప్రియాంక(Priyanka) పాతికేళ్ల తరువాత కలిసి నగరానికి రానున్నారు. డీఎంకే మహిళా హక్కుల మహానాడుకు వారు హాజరుకానున్నారు. దీంతో కాంగ్రెస్ నేతల్లో జోష్ నెలకొంది. 1998లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో నిర్వహించిన పార్టీ మహానాడులో సోనియా, ప్రియాంక పాల్గొన్నారు. అనంతరం, 2018లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో నగరంలో ఈ నెల 14న జరుగనున్న డీఎంకే మహిళా హక్కుల మహానాడులో సోనియా, ప్రియాంక ఒకే వేదిక పంచుకోనున్నారు. సీఎం స్టాలిన్ నేతృత్వంలో, డీఎంకే సంయుక్త కార్యదర్శి కనిమొళి పర్యవేక్షణలో జరుగనున్న ఈ మహానాడుకు సోనియా ప్రత్యేక అతిథిగా పాల్గొననుండగా, ప్రియాంక, సుప్రియ సూలే. సుభాషిణి అలి, అణి రాజా, సుస్మితదేవ్ తదితరులు ప్రసంగించనున్నారు. 25 ఏళ్ల క్రితం సోనియా, ప్రియాంక పాల్గొన్న మహానాడు శ్రీపెరంబుదూర్ సమీపంలో జరిగింది.
సత్యమూర్తి భవన్కు ఆహ్వానం...: శనివారం నగరానికి రానున్న సోనియా, ప్రియాంకలకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఆహ్వానం పలికింది. సత్యమూర్తి భవన్కు రావాలని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి ఆహ్వానించారు. ఈ విషయమై ఉత్తర చెన్నై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంఎస్ ద్రవ్యం విలేఖరులతో మాట్లాడుతూ... సత్యమూర్తి భవన్కు ఇప్పటికే సోనియా వచ్చారని, ఆమెకు అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు తంగబాలు నేతృత్వంలో ఘనస్వాగతం పలికామన్నారు. ప్రియాంక ఇప్పటివరకు సత్యమూర్తి భవన్కు రాలేదని, ప్రస్తుత పర్యటనలో ఆమె సత్యమూర్తి భవన్కు రావాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రియాంకకు ‘ఈ-మెయిల్’ ద్వారా ఆహ్వానం పంపినట్లు ఆయన తెలిపారు.