Gyanvapi Row: మసీదులో వజు అనుమతిపై సమావేశం.. కలెక్టర్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు..
ABN , First Publish Date - 2023-04-17T17:48:07+05:30 IST
ఉత్తర ప్రదేశ్ లోని జ్ఞానవాపి మసీదులో రంజాన్ సందర్భంగా వుజు (కాళ్లు, చేతులు కడుగుకోవడం) నిర్వహించేందుకు
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లోని జ్ఞానవాపి (Gyanvapi) మసీదులో రంజాన్ సందర్భంగా వజు (కాళ్లు, చేతులు కడుగుకోవడం) నిర్వహించేందుకు అనుమతించవచ్చునా? అనే అంశంపై చర్చించేందుకు ఏప్రిల్ 18న ఓ సమావేశం నిర్వహించాలని వారణాసి జిల్లా కలెక్టర్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం ఆదేశించింది. మసీదు నిర్వహణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. జ్ఞానవాపి మసీదును అంజుమన్ ఇంతెజామియా నిర్వహిస్తోంది.
ఈ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (Chief Justice of India D Y Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ కమిటీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఫౌంటెన్ (శివలింగం) ప్రాంతంలో వజు నిర్వహించేవారని చెప్పారు. ఈ ప్రదేశంలో కొన్ని వాష్ రూమ్స్ ఉన్నట్లు తెలిపారు. గత ఏడాది ఇక్కడ శివలింగం ఉన్నట్లు వెల్లడి కావడంతో ఈ ప్రదేశాన్ని సురక్షితంగా కాపాడాలని ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. దీంతో ఈ ప్రదేశాన్ని సీలు చేశారని తెలిపారు. ఇక్కడ మళ్లీ కాళ్లు, చేతులు కడుగుకోవడానికి అనుమతించాలని కోరారు.
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, వజు నిర్వహణకుగల అవకాశాలపై ఓ సమావేశాన్ని నిర్వహించాలని వారణాసి (Varanasi) జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. సామరస్యపూర్వకమైన ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉందేమో చూడాలని తెలిపింది. ఈ సమావేశంలో సమ్మతి కుదిరితే, వెంటనే అమలు చేయాలని, తదుపరి ఉత్తర్వుల కోసం ఎదురు చూడవలసిన అవసరం లేదని చెప్పింది.
జ్ఞానవాపి మసీదులో శివలింగం కనిపించినట్లు హిందూ వర్గాలు చెప్పడంతో ఈ ప్రాంతాన్ని సురక్షితంగా కాపాడాలని సుప్రీంకోర్టు గత ఏడాది ఆదేశించింది.
ఇవి కూడా చదవండి :
Same-sex marriage : స్వలింగ వివాహాలపై పిటిషన్లను తోసిపుచ్చండి.. సుప్రీంకోర్టును కోరిన కేంద్రం..
PM Modi : కుల గణనపై మోదీకి ఖర్గే లేఖ