Muslim Quota : కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు భారీ షాక్
ABN , First Publish Date - 2023-04-13T20:41:04+05:30 IST
కర్ణాటక శాసన సభ ఎన్నికల తరుణంలో బీజేపీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం
న్యూఢిల్లీ : కర్ణాటక శాసన సభ ఎన్నికల (Karnataka Assembly Elections) తరుణంలో బీజేపీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టంగా ఉందని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేసి, వారికి బదులుగా వొక్కళిగ, లింగాయత్ సామాజిక వర్గాలకు చెరొక రెండు శాతం చొప్పున రిజర్వేషన్లను కల్పించడాన్ని తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం హేతుబద్ధత లేకుండా, శాసన సభ ఎన్నికలకు కొద్ది వారాల ముందు ఈ నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించింది.
కర్ణాటక శాసన సభ ఎన్నికలు మే 10న జరుగుతాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మార్చి 24న చేసిన ప్రకటనలో, ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్ల (Muslim Reservations)ను రద్దు చేస్తున్నట్లు, వారికి ఇస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లలో రెండు శాతాన్ని వొక్కళిగలకు, రెండు శాతాన్ని లింగాయత్‌లకు కేటాయించినట్లు తెలిపింది. ముస్లింలకు ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్ కేటగిరీలో రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనేక మంది సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. ముస్లింల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని, సమానత్వం, లౌకికవాద సూత్రాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. కర్ణాటక జనాభాలో 13 శాతం మంది ముస్లింలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన అధ్యయనాన్ని నిర్వహించలేదని, శాస్త్రీయమైన సమాచారాన్ని సేకరించలేదని ఆరోపించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ నిర్ణయం వెనుకగల హేతుబద్ధతను ప్రశ్నించింది.
ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. రాష్ట్రంలోని వివిధ వర్గాల సాంఘిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేసిన కమిషన్ సిఫారసుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రాష్ట్ర జనాభాలో వొక్కళిగలు, లింగాయత్‌లు దాదాపు 40 శాతం మంది ఉన్నారని తెలిపింది. వారి చారిత్రక, సాంస్కృతిక అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు వివరించింది. ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో ఎక్కువ శాతం రిజర్వేషన్లను పొందే అర్హత వారికి ఉందని తెలిపింది.
సుప్రీంకోర్టు స్పందిస్తూ, కమిషన్ నివేదిక చెల్లుబాటుపై సందేహాలు వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించేందుకు తగిన మరిన్ని సాక్ష్యాధారాలను సమర్పించాలని ఆదేశించింది. ఈ నిర్ణయానికి రావడానికి ఆధారాలేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని 1992లో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిందని, ప్రభుత్వ నిర్ణయం ఈ పరిమితిని దాటిపోయిందని గుర్తు చేసింది. ఈ పరిమితిని మించి రిజర్వేషన్లు కల్పించాలంటే అసాధారణ పరిస్థితులు, కారణాలు ఉండాలని వివరించింది. ఈ పిటిషన్లపై తమ వాదనలను సమర్పించాలని కర్ణాటక ప్రభుత్వంతోపాటు వొక్కళిగ, లింగాయత్ సామాజిక వర్గాల ప్రతినిధులను ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ నిర్ణయానికి అనుగుణంగా ఉద్యోగ నియామకాలు జరపవద్దని, విద్యా సంస్థల్లో ప్రవేశాలను కల్పించవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 18న జరుగుతుందని తెలిపింది.
ఇవి కూడా చదవండి :
Congress : రాహుల్ గాంధీ అపీలుపై విచారణ
Siachen Day: సియాచిన్ డే.. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ప్రదేశంలో భారత సైన్యం ఘన విజయానికి గుర్తు..