DMKFiles: తమిళనాట ఆసక్తికర రాజకీయం.. డీఎంకే, బీజేపీ మధ్య ‘డీఎంకే ఫైల్స్’ పేరుతో రచ్చోరచ్చ..!
ABN , First Publish Date - 2023-04-14T17:26:31+05:30 IST
తమిళనాడు బీజేపీ (Tamilnadu BJP) రాజకీయంగా దూకుడుగా వెళుతోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై (Annamalai) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్‌ను (Tamilnadu CM Stalin), ఆయన కుటుంబ సభ్యులను..
చెన్నై: తమిళనాడు బీజేపీ (Tamilnadu BJP) రాజకీయంగా దూకుడుగా వెళుతోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై (Annamalai) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్‌ను (Tamilnadu CM Stalin), ఆయన కుటుంబ సభ్యులను రాజకీయంగా టార్గెట్ చేశారు. తాజాగా.. ‘డీఎంకే ఫైల్’ (DMK File) పేరుతో స్టాలిన్, ఆయన కుటుంబ సభ్యులు అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలను, అఫిడవిట్‌లో వెల్లడించని ఆస్తుల వివరాలను పోల్చుతూ వీడియో విడుదల చేశారు. లెక్కల్లో చూపని ఆస్తుల చిట్టాను అన్నామలై బయటపెట్టారు. ఒక్క స్టాలిన్ ఆస్తులనే కాదు డీఎంకే మంత్రుల ఆస్తులను (DMK Ministers Assets) కూడా వీడియోలో పూసగుచ్చినట్టు వివరించారు. Tamil New Year Day (Puthandu) సందర్భంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకే నేతల చిట్టాను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై విడుదల చేశారు.
ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ.. ఒక్క డీఎంకే నేతల కుంభకోణాలను మాత్రమే కాదని, అన్ని పార్టీల అవినీతి బాగోతాలను తమిళనాడు ప్రజల ముందు ఉంచుతానని అన్నామలై స్పష్టం చేయడం గమనార్హం. ‘నా భూమి.. నా ప్రజలు’ (My land, My People) పేరుతో తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. డీఎంకే నేతల అవినీతిని ప్రజల ముందు బట్టబయలు చేయడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. జూన్ మొదటి వారం నుంచి ఈ పాదయాత్ర మొదలవుతుందని, బీజేపీ శ్రేణులు ఈ యాత్రను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంకా.. ఆయన మాట్లాడుతూ.. ఇవాళ విడుదల చేసిన డీఎంకే నేతల అవినీతి చిట్టా పార్ట్-1 మాత్రమేనని, ఈ సంవత్సరం అంతా ఈ సిరీస్ కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. ట్విటర్‌లో కూడా తమిళనాడు బీజేపీ యాక్టివ్‌గా ప్రచారం చేస్తోంది. ట్విటర్‌లో DMKFiles, Annamalai ట్రెండింగ్‌లో ఉండటం గమనార్హం. ‘కె.అన్నామలై’ అధికారిక ట్విటర్ ఖాతాతో పాటు, ‘ఆర్మీ ఆఫ్ ధీరన్ అన్నామలై’ అనే ట్విటర్ అకౌంట్‌లో కూడా డీఎంకే ఫైల్స్ వీడియోలతో బీజేపీ సోషల్ మీడియా విభాగం హోరెత్తిస్తోంది.
డీఎంకే ఫైల్స్‌పై డీఎంకే రియాక్షన్ ఏంటంటే..
ఇక.. ఈ డీఎంకే ఫైల్స్‌పై అధికార డీఎంకే నేతలు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. డీఎంకే ఎంపీ ఆర్‌ఎస్ భారతి ‘డీఎంకే ఫైల్స్ ఒక జోక్’ అని కొట్టిపారేశారు. అన్నామలై విడుదల చేసిన జాబితాలో ఉన్నవాళ్లంతా అఫిడవిట్‌లో ఆస్తులను ప్రకటించినవాళ్లేనని, ఒకవేళ ఆ ఆస్తులు కాకుండా అక్రమ ఆస్తులు ఉన్నట్లు తేలితే ఆ అభ్యర్థి ఎన్నికను సవాల్ చేసే హక్కు ప్రతీ పౌరుడికి ఉందని చెప్పారు. అదానీ గురించి హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక నుంచి, ఆరుద్ర కుంభకోణం నుంచి ప్రజల ఆలోచనను దారి మళ్లించేందుకే అన్నామలై ఈ తరహా ఎత్తుగడకు తెరలేపారని డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఆర్ఎస్ భారతి విమర్శించారు.
అన్నామలై చెప్పినట్టు చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగితే 2014 నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ ఏం చేస్తోందని నిలదీశారు. అన్నామలై చేస్తున్న ఈ ప్రచారాలతో డీఎంకే నష్టపోయేది ఏం లేదని, తాము 40 పార్లమెంట్ స్థానాలు గెలుచుకునేందుకు ఈ తరహా ప్రచారాలు కూడా పరోక్షంగా సాయపడతాయని ఈ డీఎంకే ఎంపీ జోస్యం చెప్పారు. ‘డీఎంకే ఫైల్స్’ పేరుతో తమిళనాడు బీజేపీ విడుదల చేసిన ఈ జాబితాలో డీఎంకే రూ.1.34 లక్షల కోట్ల అవినీతికి పాల్పడినట్లు పేర్కొనడం గమనార్హం.