MK Stalin met Senthil: మంత్రిని పరామర్శించిన స్టాలిన్.. ఇదేం టార్చర్ అంటూ ఫైర్..!
ABN , First Publish Date - 2023-06-14T11:53:42+05:30 IST
మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీపై తెల్లవారుజామున 2 గంటల వరకూ కూడా ఒత్తిడి తీసుకువచ్చి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసహనం వ్యక్తం చేశారు. ఇది అమానవీయమైన చర్య అని అన్నారు. చెన్నైలోని ఓముందురార్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న సెంథిల్ కుమార్‌ను స్టాలిన్ పరామర్శించారు.
చెన్నై: మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ (Senthil Balaji)పై తెల్లవారుజామున 2 గంటల వరకూ కూడా ఒత్తిడి తీసుకువచ్చి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) అసహనం వ్యక్తం చేశారు. చెన్నైలోని ఓముందురార్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న సెంథిల్ కుమార్‌ను స్టాలిన్ బుధవారం ఉదయం పరామర్శించారు.
''తెల్లవారుజామున 2 గంటల వరకూ ఆయనపై (సెంథిల్ బాలాజీ) ఒత్తిడి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో అడ్మిట్ అ్యయారు. ఈడీ విచారణకు సహకరిస్తానని మంత్రి చెబుతున్నా కూడా ఆయనను ఎందుకు టార్చర్ పెట్టారు? తప్పుడు ఉద్దేశాలతోనే ఈడీ అధికారులను పంపినట్టు కనిపిస్తోంది. వాళ్లు అమానవీయంగా ప్రవర్తించారు. బీజేపీ చేసే ఇలాంటి బెదిరింపులకు డీఎంకే భయపడిపోదు. 2024 ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారు'' అని స్టాలిన్ అన్నారు. మంత్రిని పరామర్శించేందుకు స్టాలిన్ రావడం, మంత్రి మద్దతుదారులు పెద్దఎత్తున ఆసుపత్రికి చేరుకోవడంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను ఆసుపత్రి వద్ద మోహరించారు. ఆసుపత్రి వెలుపల డీఎంకే అభిమానులు పెద్దఎత్తున చేరుకుని గవర్నర్ ఆర్.ఎన్.రవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆసుపత్రి వద్ద హైడ్రామా
దీనికి ముందు అర్ధరాత్రి దాటేంత వరకూ సెంథిల్ బాలాజీని ప్రశ్నించిన ఈడీ ఆయనను అదుపులోనికి తీసుకుని, వైద్య పరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అక్కడికి చేరుకోగానే కారులోనే సెంథిల్ ఛాతీని పట్టుకుని విలవిల్లాడుతూ బిగ్గరగా ఏడడవంతో హైడ్రామా చేటుచేసుకుంది. వెంటనే ఆయనను ఆసుపత్రిలోని ఐసీయూలో చేర్చారు. మంగళవారం ఉదయం నుంచి సెంథిల్ బాలాజీ నివాసం, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన ఈడీ అధికారులు సచివాలయంలోని ఆయన ఛాంబర్‌లో కూడా తనిఖీ చేయడం రాజకీయవర్గాల్లో ప్రకంపనలు రేపింది. మనీలాండరింగ్ కింద ఆయనను అరెస్టు చేసినట్టు ఈడీ వర్గాలు చెబుతుండగా, అధికారికంగా మంత్రిని అరెస్టు చేసినట్టు ప్రకటించ లేదని డీఎంకే నేతలు ఆరోపించారు. ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు మంత్రి స్పృహలో లేరని తెలిపారు.