Pakistan: పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమిదే...
ABN , First Publish Date - 2023-03-09T11:35:55+05:30 IST
భారత ఉపఖండం (Indian Subcontinent) నుంచి విడిపోవడానికి బీజాలు పడిన రోజును ఆర్భాటంగా నిర్వహించే పాకిస్థాన్ ఈసారి
ఇస్లామాబాద్ : భారత ఉపఖండం (Indian Subcontinent) నుంచి విడిపోవడానికి బీజాలు పడిన రోజును ఆర్భాటంగా నిర్వహించే పాకిస్థాన్ ఈసారి ఆ పనిని మొత్తానికి మానుకుంటోంది. బ్రిటిష్ (British) పాలన అంతమై, స్వతంత్ర భారత దేశం ఏర్పాటైతే, హిందువులు, ముస్లింలు కలిసి ఉండే దేశంలో ముస్లింలు మైనారిటీలైపోతారనే ఆలోచనతో ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలని 1940 మార్చిలో జరిగిన ఈ పార్టీ సమావేశం తీర్మానించింది. పాకిస్థాన్ ఏర్పాటుకు పునాది రాయి పడిన మార్చి 23ను పాకిస్థాన్ దినోత్సవంగా నిర్వహిస్తూ ఉంటారు.
1940లో మహమ్మద్ అలీ జిన్నా (Muhammad Ali Jinnah) నేతృత్వంలోని ఆలిండియా ముస్లిం లీగ్ (All India Muslim League) సమావేశం లాహోర్ (Lahore)లో జరిగింది. ఆ సంవత్సరం మార్చి 21న దాదాపు లక్ష మంది ప్రజలను ఉద్దేశించి జిన్నా మాట్లాడారు. ఆ సభలో పాల్గొన్నవారంతా ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. 1940 మార్చి 23న ఆలిండియా ముస్లిం లీగ్ వర్కింగ్ కమిటీ దేశ విభజన కోసం తీర్మానం చేసింది. అప్పట్లో ఈ తీర్మానాన్ని లాహోర్ రిజల్యూషన్ అని పిలిచేవారు. దీనిలో పాకిస్థాన్ అనే పదం లేదు. చివరికి 1947 ఆగస్టులో పాకిస్థాన్ ప్రత్యేక దేశంగా ఏర్పాటైంది. ప్రపంచంలో మొదటి ఇస్లామిక్ రిపబ్లిక్ దేశం ఇదే.
లాహోర్ రిజల్యూషన్ ఆమోదం పొందిన రోజు 1940 మార్చి 23 కాబట్టి ఏటా మార్చి 23న పాకిస్థాన్ దినోత్సవంగా ఆ దేశంలో నిర్వహిస్తుంటారు. అయితే కోవిడ్ మహమ్మారి వంటి కారణాలతో కొన్నిసార్లు ఈ వేడుకలను నిర్వహించలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ఏడాది కూడా ఈ ఆర్భాటపు కార్యక్రమాన్ని నిర్వహించరాదని పాకిస్థాన్ సైన్యం (Pakistan Army), ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
వేడుకల తీరు...
పాకిస్థాన్ దినోత్సవాల్లో ఆ దేశ సైన్యం తన శక్తి, సామర్థ్యాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇస్లామాబాద్‌లో పెద్ద ఎత్తున కవాతు, ఆయుధాల ప్రదర్శన చేస్తుంది. ఈ కార్యక్రమాలకు విదేశీ నేతలు, ప్రతినిధులను ఆహ్వానిస్తూ ఉంటుంది. ఈ కవాతు, ప్రదర్శన, వేడుకలు ఇస్లామాబాద్‌లో 31 గన్ శాల్యూట్‌తోనూ, ప్రొవిన్షియల్ రాజధాని నగరాల్లో 21 గన్ శాల్యూట్‌తోనూ ప్రారంభమవుతాయి.
ఈ ఏడాది రద్దవడానికి కారణాలు...
విశ్వసనీయ సమాచారం ప్రకారం, పాకిస్థాన్ సైన్యం టాప్ కమాండర్స్ గత వారం రావల్పిండిలోని జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో సమావేశమయ్యారు. ద్రవ్యోల్బణం విపరీతంగా ఉండటం, ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడటం, రక్షణ వ్యయాన్ని తగ్గించుకోవాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ఒత్తిడి చేయడం వంటి కారణాల వల్ల ఈ ఏడాది పాకిస్థాన్ దినోత్సవాలను నిర్వహించరాదని నిర్ణయించారు. మరోవైపు బలోచ్ తిరుగుబాటుదారులు, తెహరీక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దాడుల్లో పాకిస్థాన్ సైనికులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోతుండటం కూడా మరొక కారణమని చెప్పవచ్చు.
గతంలో కూడా...
పాకిస్థాన్ దినోత్సవాలను 2020లో కోవిడ్-19 మహమ్మారి వల్ల, 2022లో ప్రతికూల వాతావరణం వల్ల రద్దు చేశారు.
ఇవి కూడా చదవండి :
Maoist Vs Police : సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్