Chhattisgarh : ‘భయపడేవాడు మోదీయే కాదు’ : మోదీ

ABN , First Publish Date - 2023-07-07T14:15:24+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) శుక్రవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. అవినీతి ప్రభుత్వంపై చర్యలు తీసుకోవడంలో వెనుకాడేది లేదన్నారు. భయపడేవాడు మోదీయే కాదన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఛత్తీస్‌గఢ్ సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేయబోనని చెప్పారు.

Chhattisgarh : ‘భయపడేవాడు మోదీయే కాదు’ : మోదీ
Narendra Modi

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) శుక్రవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. అవినీతి ప్రభుత్వంపై చర్యలు తీసుకోవడంలో వెనుకాడేది లేదన్నారు. భయపడేవాడు మోదీయే కాదన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఛత్తీస్‌గఢ్ సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేయబోనని చెప్పారు. ఈ ఏడాది చివరిలో ఈ రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే.

మోదీ శుక్రవారం ఛత్తీస్‌గఢ్ రాజధాని నగరం రాయ్‌పూర్‌లో రూ.7,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భయపడేవాడు మోదీయే కాదని చెప్పారు. కాంగ్రెస్ ఎంత గట్టిగా ప్రయత్నించినప్పటికీ, తాను ఛత్తీస్‌గఢ్ సంక్షేమానికి చర్యలు చేపట్టడంలో వెనుకంజ వేయబోనని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు తాము పెట్టామని చెప్పారు. పేదలకు కాంగ్రెస్ శత్రువు అని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మారాలని ప్రజలు కోరుకుంటున్నారని, రాష్ట్రంలో ఆ గాలి వీస్తోందని చెప్పారు.

రాష్ట్ర అభివృద్ధిని ఓ పెద్ద పంజా (హస్తం) ఓ గోడలా అడ్డుకుంటోందని దుయ్యబట్టారు. ఇది కాంగ్రెస్ పంజా అని, ప్రజల హక్కులను లాక్కుంటోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకుని, నాశనం చేయాలని ఈ పంజా సంకల్పించిందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ సమక్షంలోనే మోదీ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం.

ఈ కొత్త ప్రాజెక్టుల వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, ప్రజల జీవితాలు మెరుగుపడతాయని మోదీ తెలిపారు. గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో సదుపాయాలు, అభివృద్ధి ప్రస్థానం కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. రాష్ట్రంలోని అంటాగఢ్-రాయ్‌పూర్ మధ్య నడిచే కొత్త రైలును మోదీ వర్చువల్ విధానంలో జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిదారులకు కార్డుల పంపిణీని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తూ, బస్సు ప్రమాదంలో మరణించిన ముగ్గురు వ్యక్తులకు మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడినవారికి చికిత్స చేయించడానికి సహాయపడతామని తెలిపారు.

ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ అంతకుముందు మోదీకి కొన్ని బహుమతులు అందజేశారు.

ఇవి కూడా చదవండి :

Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్ర తాత్కాలిక నిలుపుదల

2024 Lok Sabha Elections : మోదీ సంచలన నిర్ణయం.. తమిళనాడు నుంచి పోటీ?..

Updated Date - 2023-07-07T14:15:24+05:30 IST