Rain Alert: దేశ వ్యాప్తంగా జోరుగా వానలు.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే రాష్ట్రాలివే!
ABN , First Publish Date - 2023-07-06T13:01:42+05:30 IST
నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సారి రుతుపవానల రాక కాస్త ఆలస్యమైనప్పటికీ క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించాయి. దీంతో పలు రాష్ట్రాల్లోనైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సారి రుతుపవానల రాక కాస్త ఆలస్యమైనప్పటికీ క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించాయి. దీంతో పలు రాష్ట్రాల్లోనైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా.. రానున్న 24 గంటల్లో గోవా, మధ్య మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. వీటితోపాటు ఒడిషా, గుజరాత్, చత్తీస్‌ఘడ్, కోస్తా కర్ణాటక, కేరళలో కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఇక బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీఘడ్, ఢిల్లీ, రాజస్థాన్‌లలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలో గురువారం మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశ రాజధానిలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికే 26.5 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోయాయి. ఈ సీజన్‌లో ఇది సగటు ఉష్ణోగ్రతల కంటే తక్కువ. కాగా వర్షాల కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పాడ్డాయి. ఇక ముంబైలో రాత్రి నుంచి వర్షాల తీవ్రత పెరిగింది. దాదర్, మహిమ్, ఖార్, మాతుంగా, కుర్లా వంటి పలు ప్రాంతాల్లో గత 12 గంటల్లో వర్షపాతం 40 మిల్లీ మీటర్ల నుంచి 70 మిల్లీ మీటర్ల వరకు నమెదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కేరళలోని కొట్టాయంలో ఇళ్లలోకి నీరు చేరుకుంది. మరోవైపు కక్కాడ్ నది పొంగి పొర్లడంతో కన్నూర్‌కు వరద పొటెత్తింది. దీంతో అక్కడి నివసించే వారి ఇళ్లు మునిగిపోయాయి. అధికారులు చర్యలు చేపడుతున్నారు.