Siddaramaiah: కాంగ్రెస్ సిద్ధాంతాలను ఇష్టపడే ఎవరైనా పార్టీలోకి రావచ్చు..
ABN , First Publish Date - 2023-08-28T16:26:44+05:30 IST
'ఆపరేషన్ హస్త'లో భాగంగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ విపక్ష నేతలకు గాలం వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపై నమ్మకం ఉన్న ఎవరినైనా సరే తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. సోమవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ దివాళా తీసిందని అన్నారు.
మైసూరు: 'ఆపరేషన్ హస్త' (Operation Hasta)లో భాగంగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ విపక్ష నేతలకు గాలం వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపై నమ్మకం ఉన్న ఎవరినైనా సరే తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) తెలిపారు. సోమవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ దివాళా తీసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 100 రోజులు అయినా అసెంబ్లీలో విపక్ష నేతను బీజేపీ నియమించలేకపోతోందని విమర్శించారు. కర్ణాటక విపక్ష పార్టీ చరిత్రలో ఇలాంటింది ఎప్పుడూ జరగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా తాము ఆహ్వానిస్తామని, అయితే పార్టీ సిద్ధాంతాలపై నమ్మకం ఉండాలని చెప్పారు.
'ఆపరేషన్ హస్త' అంటే..?
విపక్ష పార్టీల నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షించే వ్యూహమే 'అపరేషన్ హస్త'. ఇందులో భాగంగా మొదటి దశలో దిగువ స్థాయి నేతలు, స్థానిక నేతలను లక్ష్యంగా చేసుకుని వారిని పార్టీలోకి లాక్కుంటారు. ఆ తర్వాత దశలో పెద్దఎత్తున తమ అనుచరులు కాంగ్రెస్‌లోకి చేరడంతో ఒత్తిడికి గురైన అగ్రనేతలను పార్టీలోకి తీసుకుంటారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆయా నేతలతో సంప్రదింపులు సాగించి, పార్టీలోకి తెస్తుంది. క్యాబినెట్ మంత్రులు ఈ బాధ్యత తీసుకుంటారు. జేడీ(ఎస్) నుంచి గరిష్ట స్థాయిలో నాయకులను కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు వ్యూహరచన జరుగుతోంది. ఈ బాధ్యతను వ్యవసాయ శాఖ మంత్రి ఎన్.చెలువరస్వామికి అప్పగించినట్టు కాంగ్రెస్ వర్గాల సమాచారం. జేడీఎస్ నేత కుమారస్వామికి కుడిభుజంలా చెలువరస్వామి గతంలో వ్యవహరించారు.
బీజేపీ నుంచి వలసలు...
మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఎస్.టి.సోమశేఖర్ అనుచరులుగా చెప్పుకునే స్థానిక నేతలు ఇటీవల పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరారు. వీరంతా సోమశేఖర్‌ను సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు ఒప్పిస్తామని బహిరంగంగా ప్రకటించారు. తాజా పరిణామలపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైతం రాజకీయాల్లో ఏదైనా సాధ్యమని ఇటీవల వ్యాఖ్యానించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ కూలదోయడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే 10 నుంచి 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ యోచనగా ఉంది.