DMK Vs BJP : కులతత్వాన్ని డీఎంకే ప్రోత్సహిస్తోంది : బీజేపీ

ABN , First Publish Date - 2023-09-07T19:07:32+05:30 IST

సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చెప్పిన నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు కే అణ్ణామలై ఘాటుగా స్పందించారు. సనాతన ధర్మంలో వచ్చిన సమస్యలను పరిష్కరించడం కోసం ఎప్పటికప్పుడు అదే ధర్మం నుంచి సాధువులు, స్వామీజీలు ఉద్భవించారని చెప్పారు.

DMK Vs BJP : కులతత్వాన్ని డీఎంకే ప్రోత్సహిస్తోంది : బీజేపీ
MK Stallin, K Annamalai

చెన్నై : సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చెప్పిన నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు కే అణ్ణామలై ఘాటుగా స్పందించారు. సనాతన ధర్మంలో వచ్చిన సమస్యలను పరిష్కరించడం కోసం ఎప్పటికప్పుడు అదే ధర్మం నుంచి సాధువులు, స్వామీజీలు ఉద్భవించారని చెప్పారు. డీఎంకే నేతలు ఆత్మవంచన చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. డీఎంకే విభజన రాజకీయాల వల్ల రాష్ట్రంలో కుల ఘర్షణలు అధికంగా జరుగుతున్నాయన్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌లకు హిందూ మతం గురించి తెలిసిందేమీ లేదన్నారు. శతాబ్దాల నుంచి సనాతన ధర్మం తనను తాను సంస్కరించుకుంటోందన్నారు. ఈ ధర్మం స్వభావమే కాలానికి అతీతమైనదని చెప్పారు. దీనికి పుట్టుక లేదని, అదే విధంగా అంతం కూడా లేదని తెలిపారు. ఇది ఇతర మతాల కన్నా చాలా పురాతనమైనదని చెప్పారు. మానవుడే దైవమని సనాతన ధర్మం విశ్వసిస్తుందన్నారు. ఇది కేవలం మానవులను మాత్రమే కాకుండా జీవులన్నిటినీ అదే విధంగా చూస్తుందన్నారు. సనాతన ధర్మం స్వభావమే అందరినీ సమానంగా పరిగణించడమని తెలిపారు. ప్రతి మతంలోనూ కొందరు వ్యక్తులు ఉంటారని, కొన్ని వివక్షాపూరితమైన ఆచారాలను వ్యక్తులు తీసుకొచ్చారని అన్నారు. గొప్ప స్వామీజీలు, సాధువులు, సంస్కర్తలు సనాతన ధర్మం నుంచి వచ్చి, దానిని సంస్కరించారని తెలిపారు. వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తి, దానిని నిర్మూలించారని తెలిపారు. స్వామి సహజానంద, దయానంద సరస్వతి వంటివారు సనాతన ధర్మంలో ఉన్నారన్నారు. అదేవిధంగా తమిళనాడులోని హిందూ సమాజంలోకి మానవులు తీసుకొచ్చిన దురాచారాలను తొలగించడం కోసం అనేక మంది గొప్ప సంస్కర్తలు కృషి చేశారని తెలిపారు.


ఆళ్వారులు, నాయనార్లు..

తమిళనాడులో ఆళ్వారులు, నాయనార్లు అనేక సంస్కరణలను తీసుకొచ్చారని తెలిపారు. వారు మానవులను దైవంగా పరిగణించేవారని తెలిపారు. 63 మంది నాయనార్లలో 17 మంది బ్రాహ్మణులని, మిగిలినవారి కులాలు ఏమిటని ప్రశ్నించారు. చాలా మంది నాయనార్లు అణగారిన వర్గాలకు చెందినవారేనన్నారు. వారిని మనం సాధువులు, స్వామీజీలుగా ఆరాధిస్తామని గుర్తు చేశారు. ఇది ఆధ్యాత్మిక భూమి అని తెలిపారు. ఆళ్వారులలో ముగ్గురు బ్రాహ్మణులు ఉన్నారని, మిగిలిన ఆళ్వారులు అణగారిన వర్గాలకు చెందినవారని తెలిపారు. అణగారిన వర్గాలకు చెందిన ఆళ్వారులను దైవంగా భావించి, ఆరాధిస్తున్నట్లు తెలిపారు. సనాతన ధర్మంలో ఏదైనా సమస్య వచ్చిందంటే, అది కచ్చితంగా మానవులు సృష్టించినదేనని చెప్పారు. అటువంటి సమస్యలను సాధువులు, స్వామీజీలు, సంస్కర్తలు నిర్మూలిస్తారని చెప్పారు.

కులపరమైన హింస తమిళనాడులోనే అత్యధికం

డీఎంకే విభజన రాజకీయాలు చేయడం వల్ల తమిళనాడులో కులపరమైన హింస అత్యధికంగా జరుగుతోందని అణ్ణామలై ఆరోపించారు. తమిళనాడులో కులాన్ని ప్రోత్సహిస్తున్న పార్టీ డీఎంకే అని చెప్పారు. అందుకే దేశంలో మిగిలిన చోట్ల ఎక్కడా లేనంత కులపరమైన హింస రాష్ట్రంలో జరుగుతోందన్నారు. కులపరమైన సంఘర్షణలు, విభేదాలు అత్యధికంగా తమిళనాడులోనే ఉన్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న రుగ్మతల్లో రెండు గ్లాసుల విధానం ఒకటి అని చెప్పారు.

ఉదయనిధి వ్యాఖ్యలు

డీఎంకే నేత, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ శనివారం సనాతన ధర్మ నిర్మూలన సదస్సులో మాట్లాడారు. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా, కరోనా వంటిదని, వీటిని వ్యతిరేకించలేమని, నిర్మూలించడం ఒక్కటే సరైనదని, సనాతన ధర్మాన్ని కూడా సమూలంగా నిర్మూలించాలని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు, బీజేపీ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీని గురించి ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలపై దీటుగా, రాజ్యాంగబద్ధంగా, వాస్తవాలు చెప్తూ స్పందించాలని కేంద్ర మంత్రులను ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.


ఇవి కూడా చదవండి :

Hello! UPI : డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారా? అయితే మీకు ఓ శుభవార్త!

Eradicate Sanatana Dharmam : మోదీపై సీఎం ఎంకే స్టాలిన్ ఆగ్రహం

Updated Date - 2023-09-07T19:07:32+05:30 IST