CM Bhupesh baghel : డబుల్ కాదు ట్రబుల్ ఇంజన్...2003-2004 కూడా మావే
ABN , First Publish Date - 2023-01-08T16:04:11+05:30 IST
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీపై చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ విరుచుకుపడ్డారు. హిమాచల్‌లో గత డబుల్ ఇంజన్..
రాయ్‌పూర్: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీపై చత్తీస్‌గఢ్ (Chattisgarh) ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ (Bhupesh Baghel) విరుచుకుపడ్డారు. హిమాచల్‌లో గత డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ప్రజలు తోసిపుచ్చారని, అది డబుల్ ఇంజన్ కాదు.. ట్రబుల్ ఇంజన్ అనే విషయం ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. 2023-2024 కూడా తమదేనని చెప్పారు. అమిత్‌షా శనివారంనాడు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాలో జరిగిన ర్యాలీలో రాష్ట్రంలో అవినీతి, ఉచిత ఆహారధాన్యాల పథకంపై చేసిన విమర్శలను సీఎం తిప్పికొట్టారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతి వ్యక్తికి 5 కిలోల ఉచిత బియ్యం ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం కుటుంబానికి 35 కిలోల బియ్యం ఇప్పటికే ఇస్తోందని సీఎం అన్నారు. బీజేపీ నేతలు తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా ఆ పార్టీ కేంద్ర నేతలను తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం కలెక్టరేట్లలో లిఫ్టులు, బ్యూరోక్రాట్ల భవంతుల్లో స్విమ్మింగ్‌పూల్స్ కట్టిందని, ఇప్పుడు సామాన్య ప్రజానీకం, పేదలు, ఎస్‌సీలు సైతం పథకాల ప్రయోజనాలను, సౌకర్యాలను పొందుతున్నారని చెప్పారు. ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడల్లా మాట్లేందుకు ఏవీ లేక బీజేపీ ఆరోపణలకు దిగుతుంటుందని, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు గత డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని తిప్పికొట్టారని గుర్తుచేశారు. ''అది డబుల్ ఇంజన్ కాదు, ట్రబుల్ ఇంజన్. ప్రజలకు ఆ విషయం బాగా తెలుసు. ఓపీఎస్‌ని వాళ్లు అమలు చేయలేకపోయారు. రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు'' అని బఘెల్ అన్నారు.
అమిత్‌షా గత ఎన్నికల్లో 65 సీట్లు దాటుతామని చెప్పారని, అప్పుడు ఆయన చెప్పిన సంఖ్య కాంగ్రెస్ గెలుచుకోబోయే స్థానాల సంఖ్య అని తాను చెప్పడం జరిగిందని సీఎం అన్నారు. తాము 68 సీట్లు గెలుచుకున్నామని, ఇప్పుడు తమకు 71 సీట్లు ఉన్నాయని చెప్పారు. 2023, 2024 కూడా తమవేనని ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో సహా బీజేపీ ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదన్న విషయం ప్రజలకు తెలుసునని అన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లోనే కాకుండా లోక్‌సభ ఎన్నికల్లోనూ తాము గెలుస్తామన్నారు.