Tungabhadra: ఇక ఖరీఫ్ సాగుకు ఢోకా లేదుపో..

ABN , First Publish Date - 2023-08-01T13:15:51+05:30 IST

తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir) నీటితో కళకళలాడుతోంది. సోమవారం సాయంత్రంకల్లా జలాశయంలో దాదాపు 77 టీఎంసీల నీరు చేరినట్లు బో

Tungabhadra: ఇక ఖరీఫ్ సాగుకు ఢోకా లేదుపో..

బళ్లారి, (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir) నీటితో కళకళలాడుతోంది. సోమవారం సాయంత్రంకల్లా జలాశయంలో దాదాపు 77 టీఎంసీల నీరు చేరినట్లు బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఇన్‌ఫ్లో కూడా దాదాపు 45,000 క్యూసెక్కులు ఉందన్నారు. సోమవారం నుండి మూడు రోజులు రాష్ట్రంలో భారీగా వానలు కురుస్తాయని కేంద్ర, రాష్ట్ర వాతావరణ శాఖలు ప్రకటించాయని, ప్రస్తుతం జలాశయంలో చేరిన నీటితోనే తుంగభద్ర ఆయకట్టులో ఖరీఫ్‌ సాగుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. తుంగభద్ర జలాశయం కింద సుమారు 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, ఎగువ, దిగువ, రాయబసవ, తదితర కాలువల కింద కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌(Karnataka, Andhra Pradesh) రాష్ట్రాల్లో ఖరీఫ్‏లో వివిధ పంటలు సాగు చేస్తారన్నారు. జూలై తొలి వారంలో కేవలం డ్యాంలో 2 టీఎంసీలు మాత్రమే నీరు ఉండగా, చాలా మంది ఖరీఫ్‌ సాగు పై అనుమానాలు వ్యక్తం చేశారన్నారు. కానీ భారీ వర్షాలు కారణంగా 15 రోజుల వ్యవధిలో డ్యాంలో సుమారు 77 టీఎంసీల నీరు చేరిందని తెలిపారు. తుంగభద్ర ఎగువ, దిగువ కాలువలకు ఇప్పటికే సాగు నీరు విడుదల చేశామన్నారు. 2023 సంవత్సరంలో తుంగభద్ర డ్యాంలో 212 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని బోర్డు అధికార వర్గాలు లెక్కలు వేశాయని, ఇందులో 175 టీఎంసీల నీరు వాడకంలోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యాంలో నీరు పుష్కలంగా చేరడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

Updated Date - 2023-08-01T13:15:51+05:30 IST