Sanjay Raut: థాకరేలు సోదరులు, మధ్యవర్తిత్వం అవసరం లేదు...
ABN , First Publish Date - 2023-07-07T14:45:10+05:30 IST
శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరేలు సోదరులని, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కలుసుకుంటారని, వారికి మధ్యవర్తిత్వ చేయాల్సిన అవసరం లేదని ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ అన్నారు.
ముంబై: శివసేన (Shivsena UBT) ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray), ఎంఎన్ఎస్ (MNS) చీఫ్ రాజ్ థాకరే (Raj Thackeray) సోదరులని, రాజకీయ మార్గాలు వేరైనప్పటికీ తామంతా జీవితంలో ఎక్కువ భాగం ఒకరితో ఒకరు పంచుకున్నామని శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఉద్ధవ్ థాకరే, రాజ్‌థాకరే తిరిగి చేతులుకలపాలనే విజ్ఞప్తులతో ముంబైలో పోస్టర్లు వెలిసిన నేపథ్యంలో రౌత్ తాజా వ్యాఖ్యలు చేశారు.
''రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరే మధ్య మధ్యవర్తిత్వం నెరపాల్సిన అవసరం లేదు. ఇద్దరూ సోదరులు. ఎప్పుడు అనుకుంటే అప్పులు కలిసి మాట్లాడుకుంటారు. మార్గాలు వేరైనా మేమంతా కలిసి మెలిసి జీవితం పంచుకున్నాం. ఆ భావోద్వేగాలు ఇప్పటికీ ఉన్నాయి. రాజ్‌థాకరేతో నా స్నేహం గురించి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు'' అని సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
శరద్ పవార్ మాకు స్ఫూర్తి
ఎన్‌సీపీలో తలెత్తిన సంక్షోభం, వయసురీత్యా క్రియాశీలక రాజకీయాలకు శరద్ పవార్ స్వస్తి చెప్పాలని ఎన్‌సీపీ తిరుగుబాటు వర్గం నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పవార్ ఎప్పటికీ తమకు స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. బాలాసాహెబ్ థాకరే సైతం 84-86 ఏళ్లలో ఉన్నప్పుడు ఆయనను స్ఫూర్తిగా తీసుకున్నామని, ఆయనే తమకు బలమని చెప్పారు. వయసు అనేది పవార్‌కు ఎంతమాత్రం అడ్డంకి కాదన్నారు. అజిత్ పవార్ కారణంగానే షిండే వర్గం నేతలు శివసేన విడిచిపెట్టారని, ఇప్పుడు వాళ్లంతా ఒకచోట చేరారని అన్నారు. షిండే, ఆయన వర్గం 40 మంది దొంగలు తామంతా ఒకటేనంటూ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
రాజ్‌థాకరే 2005లో శివసేనను విడిచిపెట్టారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనను ప్రారంభించారు. రాజకీయంగా సోదరులిద్దరి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ సందర్భం వచ్చినప్పుడల్లా ఇరువురూ కలుసుకుంటూ ఉంటారు.