Security downgraded: మాజీ సీఎంకు తగ్గించిన భద్రత..? కారణం ఇదే..!
ABN , First Publish Date - 2023-06-21T19:28:55+05:30 IST
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఆయన కుమారుడు ఆదిత్య థాకరే భద్రతను కుదించినట్టు తెలుస్తోంది. దీనిపై ముంబై పోలీసులు మాత్రం ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా కొనసాగడం లేదని, అందువల్ల ప్రోటాకాల్ ప్రకారం ఆయన సెక్యూరిటీ కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలను తొలగించామని తెలిపారు.
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray), ఆయన కుమారుడు ఆదిత్య థాకరే (Aaditya Thackeray) భద్రతను కుదించినట్టు (Security downgraded) తెలుస్తోంది. దీనిపై ముంబై పోలీసులు మాత్రం ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా కొనసాగడం లేదని, అందువల్ల ప్రోటాకాల్ ప్రకారం ఆయన సెక్యూరిటీ కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలను తొలగించామని తెలిపారు. ఉద్ధవ్ థాకరేకు ప్రస్తుతం జడ్ ప్లస్ క్యాటగరి కొనసాగుతోంది.
కాగా, తొలి సమాచారం ప్రకారం ఉద్ధవ్ థాకరే భద్రతను జడ్ ప్లస్ నుంచి జడ్ కేటగిరికి, ఉద్ధవ్ తనయుడు ఆదిత్య థాకరేకు వై ప్లస్ నుంచి వై కేటిగిరికి భద్రతను కుదించారు. దీనిపై శివసేన (యూబీటీ) మండిపడింది. రాజకీయ ఉద్దేశాలతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించింది. ఉద్ధవ్ థాకరే కుటుంబానికి భద్రత తగ్గించినట్టు లోక్‌సభ ఎంపీ, శివసేన (యూబీటీ) నేత రౌత్ తెలిపారు.
తోసిపుచ్చిన పోలీసులు..
మరోవైపు, ఉద్ధవ్ థాకరేకు భద్రత కుదించినట్టు వచ్చిన వార్తలను ముంబై పోలీసులు కొట్టివేశారు. ఉద్ధవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కల్పించిన అదనపు భద్రతను తొలగించినట్టు చెప్పారు. మాతోశ్రీ బంగ్లా వద్ద ఉంచిన ఇద్దరు గన్‌మెన్లను, మాతోశ్రీ వెలుపల పోలీసుల టెంట్‌లో పోలీసులను, సొసైటీ గేటు వద్ద ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్‌ను తొలగించామని తెలిపారు. అయితే మాతోశ్రీ వెలుపల ఉన్న పోలీసులు మాత్రం మెటల్ డిటెక్టర్‌లో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తినట్టు చెప్పారు.