UP by-polls: సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్
ABN , First Publish Date - 2023-08-26T20:51:14+05:30 IST
ఉత్తరప్రదేశ్ లోని ఘోసి అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ప్రధాన విపక్ష పార్టీల మధ్య సయోధ్య నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సుధాకర్ సింగ్‌కు కాంగ్రెస్ పార్టీ శనివారంనాడు మద్దతు ప్రకటించింది.
లక్నో: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ఘోసి (Ghosi) అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ప్రధాన విపక్ష పార్టీల మధ్య సయోధ్య నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi party) అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సుధాకర్ సింగ్‌కు కాంగ్రెస్ (Congress) పార్టీ శనివారంనాడు మద్దతు ప్రకటించింది.
ఘోసి నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిని నిలబెట్టరాదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడంతో పాటు ఎస్పీ అభ్యర్థికి మద్దతుగా నిలబడాలంటూ పార్టీ కార్యకర్తలను ఒక ప్రకటనలో కోరింది. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రాయ్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ''నేషనల్ డవలప్‌మెంట్ ఇంక్లూజివ్ అలయెన్స్ (I.N.D.I.A.)లో సమాజ్‌వాదీ పార్టీ భాగస్వామిగా ఉంది. ఆ కారణంగా 2023 సెప్టెంబర్ 5న జరిగే ఘోసి అసెంబ్లీ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీచేస్తున్న సుధాకర్ సింగ్‌కు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఆయనకు కాంగ్రెస్ కార్యకర్తలు పూర్తిగా సహకరించి, ఆయనకు ఘనవిజయం అందించాలి'' అని రాయ్ ఆ ప్రకటనలో కోరారు.
పొత్తేమీ కొత్త కాదు: బీజేపీ
కాగా, ఎస్పీ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంపై బీజేపీ ఉపాధ్యక్షుడు విజయ్ బహదూర్ పాఠక్ స్పందించారు. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఇప్పుడు కొత్తేమీకాదన్నారు. గతంలో రాయబరేలి, అమేథీలో సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో కాంగ్రెస్ గెలిచిందన్నారు. కచ్చితంగా ఈసారి పొత్తు 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నదేనని అన్నారు. అయితే, ఘోసితో పాటు రాష్ట్ర ప్రజలందరికీ బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వంపై గట్టి నమ్మకం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేసారు. ఈ నియోజకవర్గం నుంచి దారా సింగ్ చౌహాన్‌ను తమ అభ్యర్థిగా బీజేపీ నిలబెట్టింది. ఆసక్తికరంగా ఘోసి నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన దారా సింగ్ చౌహాన్ గత జూలైలో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. దాంతో ఆ సీటుకు ఉప ఎన్నిక అనివార్యం కాగా, ఇప్పుడు బీజేపీ టిక్కెట్‌పై తన నియోజవవర్గంలోనే ఆయన పోటీకి దిగారు.