Sharad pawar: అనుమతి లేకుండా నా ఫోటోలు వాడొద్దు.. శరద్ పవార్ సీరియస్!
ABN , First Publish Date - 2023-07-04T18:30:37+05:30 IST
అజిత్ పవార్ తిరుగుబాటు వర్గం తన ఫోటో వాడుకోవడంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ సీరియస్ అయ్యారు. తన అనుమతి లేకుండా తన ఫోటో వాడుకోరాదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
ముంబై: అజిత్ పవార్ (Ajit Pawar) తిరుగుబాటు వర్గం తన ఫోటో వాడుకోవడంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad pawar) సీరియస్ అయ్యారు. తన అనుమతి లేకుండా తన ఫోటో వాడుకోరాదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అజిత్ పవార్ వర్గం ముంబైలో ఎన్‌సీపీ కార్యాలయాన్ని మంగళవారంనాడు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఫోటోను ఆయన కార్యాలయం షేర్ చేసింది. అందులో శరద్ పవార్ ఫోటో అందులో కనిపించడంతో ఆయన ఘాటుగా స్పందించారు.
''నా అభిప్రాయాలకు వ్యతిరేకంగా, సైద్ధాంతిక విభేదాలున్న వ్యక్తులు నా ఫోటో వాడుకోవద్దు. అలాంటి వాళ్లు ముందుగా నా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది'' అని శరద్ పవార్ పరోక్షంగా అజిత్‌ను ఉద్దేశించి అన్నారు. మహారాష్ట్ర ఎన్‌సీపీ చీఫ్‌గా జయంత్ పాటిల్ కొనసాగుతారని ఆయన పునరుద్ఘాటించారు. పార్టీ రాష్ట్ర చీఫ్‌గా జయంత్ పాటిల్ స్థానంలో లోక్‌సభ ఎంపీ సునీల్ టట్కరే నియమితులైనట్టు అజిత్ పవార్ ప్రకటించిన నేపథ్యంలో సీనియర్ పవార్ తాజా వ్యాఖ్యలు చేశారు.
ఎవరి బలం ఎంత?
కాగా, మెజారిటీ ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నారని, ఆ విషయంలో ఎవరికీ సందేహం అవసరం లేదని అజిత్ పవార్ మంగళవారం మరోసారి ప్రకటించారు. 40 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని అజిత్ పవార్ ప్రమాణస్వీకారానికి ముందు గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. అయితే, ఆయన చెప్పిన లెక్కలపై ఇంకా అసందిగ్ధత కొనసాగుతోంది. పవార్ ద్వయంలో ఏ ఒక్కరూ ఇంతవరకూ తమకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల పేర్లు ప్రకటించలేదు. కాగా, ఎలాంటి కారణం చెప్పకుండా అజిత్ పవార్ తమతో సంతకాలు పెట్టించుకున్నారని కొందరు ఎమ్మెల్యేలు వాపోతున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం తమ మద్దతు శరద్ పవార్‌కేనంటూ ట్వీట్లు చేశారు. అజిత్ పవార్ వైపు ఆయన వెంట ప్రమాణస్వీకారం చేసిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నారనే వాదన కూడా వినిపిస్తోంది. శరద్ పవార్ మాత్రం దీనిపై ఇంతవరకూ పెద్దవి విప్పకుండా, పార్టీ పునర్నిర్మాణంపైనే ప్రధానంగా దృష్టి సారించారు.