Share News

Uttarkashi Tunnel Rescue Operation: కేవలం మరో 5 మీటర్ల దూరంలో.. కీలక దశకు సొరంగం పనులు..

ABN , First Publish Date - 2023-11-28T11:22:28+05:30 IST

ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు చేస్తున్న పనులు కీలక దశకు చేరుకున్నాయి. 24 మందితో కూడిన రాట్ హోల్ మైనింగ్ నిపుణుల బృందం మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రక్రియను చేపడుతున్నారు.

Uttarkashi Tunnel Rescue Operation: కేవలం మరో 5 మీటర్ల దూరంలో.. కీలక దశకు సొరంగం పనులు..

ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు చేస్తున్న పనులు కీలక దశకు చేరుకున్నాయి. 24 మందితో కూడిన రాట్ హోల్ మైనింగ్ నిపుణుల బృందం మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రక్రియను చేపడుతున్నారు. ఈ డ్రిల్లింగ్ ప్రక్రియలో రాట్ హోల్ మైనింగ్ నిపుణులు తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో రెస్క్యూ బృందం కార్మికులకు చేరువగా వెళ్లింది. ప్రస్తుతం రెస్క్యూ బృందం కార్మికులకు కేవలం 5 మీటర్ల దూరంలో ఉంది. ఇప్పటివరకు 50 మీటర్ల దూరం తవ్వకాలు పూర్తైనట్టు సహాయక బృందంలోని అధికారులు తెలిపారు. కార్మికులను చేరుకోవడానికి మరో 5 మీటర్ల దూరం తవ్వితే సరిపోతుందని చెప్పారు. ఎలాంటి అవంతరాలు ఎదురుకాకుండా అంత సవ్యంగా సాగితే నేటి సాయంత్రానికి రెస్క్యూ పనులు పూర్తై కార్మికులు బయటికొచ్చే అవకాశాలున్నాయి.

సొరంగం వద్ద మాన్యువల్ డ్రిల్లింగ్ కార్యకలాపాలు సోమవారం ప్రారంభమయ్యాయి. శిథిలాలలో చిక్కుకున్న వారి కోసం శుక్రవారం పెద్ద ఆగర్ మెషీన్‌ను ఉపయోగించి ప్రాథమిక డ్రిల్లింగ్ ప్రయత్నాలు జరిగాయి. టన్నెల్‌ పై నుంచి 300 మీటర్లు ఎత్తుకు వెళ్లి నిలువునా 86 మీటర్ల మేర డ్రిల్లింగ్‌ చేస్తున్నారు. అయితే టన్నెల్‌ పైభాగం ఎదురైనప్పుడు కార్మికులు గాయపడకుండా ఏం చేయాలనేది పెద్ద సమస్యగా మారింది. అడ్డంగా తవ్వుకుంటూ వెళ్తున్న బృందంతో దీనిపై సమన్వయం చేసుకోనున్నారు. అంతకుముందు సొరంగంలో చిక్కుకున్న కార్మికులను చేరుకోవడం కోసం ఆగర్ యంత్రంతో దాదాపు 47 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేశారు. కానీ ఆగర్ యంత్రం మధ్యలోనే విరిగిపోయింది. అది కూడా ఆ సొరంగంలో చిక్కుకుపోయింది. దీంతో మ్యానువల్ డ్రిల్లింగ్ సాయంతో మధ్యలో ఇరుకున్న అగర్ యంత్రాన్ని తొలగించారు. ఆ తర్వాత ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణులు పనులు ప్రారంభించారు.


అంతకుముందు ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, హెం సెక్రటరీ అజయ్ భల్లా, ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ ఎస్‌ఎస్ సంధు సోమవారం సొరంగం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ క్రమంలో సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో మిశ్రా మాట్లాడారు. వారిని రక్షించడానికి బహుళ ఏజేన్సీలు పని చేస్తున్నాయని, ధైర్యంగా ఉండాలని సూచించారు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) సభ్యులు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ మాట్లాడుతూ ఉత్తరకాశీలో వచ్చే 24 నుంచి 48 గంటల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసినట్టు పేర్కొన్నారు. అయితే వర్షం కారణంగా పనులకు ఆటంకం ఏర్పడే అవకాశం లేదని ఆయన తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితి వివరాలను తెలియజేస్తూ వారు సొరంగం రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్నారని, ఆరు అంగుళాల పైప్‌లైన్ ద్వారా ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాలను సరఫరా చేస్తున్నట్లు హస్నైన్ చెప్పారు. ప్రస్తుతం వారు ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు.

Updated Date - 2023-11-28T11:41:02+05:30 IST