Vande Bharat Trains: త్వరలో పడక వసతితో వందే భారత్‌ రైళ్లు

ABN , First Publish Date - 2023-09-17T07:26:53+05:30 IST

త్వరలోనే పడక వసతితో ‘వందే భారత్‌’ రైళ్ల సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఐసిఎఫ్‌ జనరల్‌ మేనేజర్‌ బీజీ మాల్యా తెలిపారు.

Vande Bharat Trains: త్వరలో పడక వసతితో వందే భారత్‌ రైళ్లు

- ఐసీఎఫ్‌ జనరల్‌ మేనేజర్‌ బీజీ మాల్యా

పెరంబూర్‌(చెన్నై): త్వరలోనే పడక వసతితో ‘వందే భారత్‌’ రైళ్ల సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఐసిఎఫ్‌ జనరల్‌ మేనేజర్‌ బీజీ మాల్యా తెలిపారు. స్థానిక మైలాపూర్‌లో శుక్రవారం ‘వందే భారత్‌ - భవిష్యత్‌ రైలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాల్యా మాట్లాడుతూ... పెరంబూర్‌ ఐసిఎఫ్‌ కర్మాగారం ఏడాదికి 3 వేల రైలుపెట్టెలు తయారుచేస్తూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. భారత రైల్వేకు మాత్రమే కాకుండా 14 దేశాలకు బోగీలు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. రైల్వే ఆధునీకరణలో భాగంగా 85 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో వందే భారత్‌ రైళ్లు తయారు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 25 రైళ్లు దేశంలోని ప్రధాన నగరాల మధ్య నడుపుతుండగా, మరో 10 రైళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. అలాగే, పడక వసతితో వందే భారత్‌ రైలు, వందే మెట్రోరైలు, వందే సరుకు రైలు తదితరాలు రూపొందించనున్నామన్నారు. సుమారు 1,000 కి.మీ దూరానికి ఈ రైళ్లు నడుపనున్నామన్నారు. ఆ ప్రకారం చెన్నై నుంచి ఢిల్లీకి 20 గంటల్లో వెళ్లవచ్చని తెలిపారు. వందే భారత్‌ రైళ్ల బరువు తగ్గించేలా అల్యూమినియంతో కొత్త వందే భారత్‌ రైళ్లు రూపొందిస్తున్నామన్నారు.

పేదల వందే భారత్‌...

పేదల కోసం వందే భారత్‌ రైలుకు సమానమైన వేగంతో వెళ్లేలా ‘పుష్‌ పుల్‌ రైల్‌’ అక్టోబరు 23వ తేది నుంచి అందుబాటులోకి రానుందన్నారు. పూర్తిగా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో కూడిన ఈ రైలుకు ఇరువైపులా విద్యుత్‌ ఇంజన్‌లతో నడపడం ద్వారా వందే భారత్‌ రైలుకు సమానంగా సుమారు 130 కి.మీ వేగంతో వెళతాయని ఆయన తెలిపారు. అలాగే, ఏసీ వసతి ఇష్టం లేని ప్రయాణికుల సౌకర్యార్ధం 22 పెట్టెలతో కూడిన పడక వసతితో కూడిన వందేభారత్‌ రైలు సేవలు అక్టోబరు 31వ తేది నుంచి ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2023-09-17T07:26:53+05:30 IST