Maharashtra: ఉద్ధవ్ శివసేన నాయకురాలిపై ఇంకుతో దాడి
ABN , First Publish Date - 2023-06-17T16:42:59+05:30 IST
శివసేన ఉద్ధవ్ బాల్‌థాకరే మహిళా నేత, ఆఫీస్ బేరర్‌పై మహారాష్ట్రలోని థానేలో జరిగిన ఒక కార్యక్రమంలో కొందరు మహిళలు దాడికి దిగారు. ఇంక్ చల్లి అవమానించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు బాధితురాలు, శివసేన యూబీటీ సోషల్ మీడియా కన్వీనర్ అయోధ్య పోల్ థానేలోని కల్వా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
థానే: శివసేన ఉద్ధవ్ బాల్‌థాకరే (Shiv sena UBT) మహిళా నేత, ఆఫీస్ బేరర్‌పై మహారాష్ట్రలోని థానేలో జరిగిన ఒక కార్యక్రమంలో కొందరు మహిళలు దాడికి దిగారు. ఇంక్ చల్లి అవమానించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు బాధితురాలు, శివసేన యూబీటీ సోషల్ మీడియా కన్వీనర్ అయోధ్య పోల్ (Ayodhya Pol) థానేలోని కల్వా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.
అహల్యాబాయ్ కోలార్ జయంతి సందర్భంగా తనను ఆహ్వానించడంతో వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందని అయోధ్య పోలో శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఈవెంట్ నిర్వాహకులు అన్ని ప్రోటోకాల్స్ పాటించారని, సేన (యూబీటీ) నేతలున్న బ్యానర్‌ను కూడా ముందుగానే తనకు పంపించారని చెప్పారు. అయితే తాను వేదక వద్దకు చేరేసరికి అక్కడ స్థానిక కార్పొరేటర్, తన ఫోటో మాత్రమే బ్యానర్‌లో కనిపించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో థాకరే వర్గీయులైన సుష్మా ఆంధారే, స్థానిక ఎంపీ రాజన్ విచారే హాజరవుతారని నిర్వాహకులు ముందుగా చెప్పినప్పటికీ అక్కడెవరూ కనిపించ లేదని చెప్పారు. ఇదే విషయాన్ని తాను నిర్వాహకులను నిలదీశానని, అయితే వారు సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారని తెలిపారు. వేదికపై ఏర్పాటు చేసిన ఫోటోలకు తాను దండలు వేస్తున్న సమయంలో కొందరు మహిళలు తనవైపు దూసుకు వచ్చారని, తన జుట్టుపట్టుకుని చేయిచేసుకున్నారని, ఇంక్ చల్లారని ఆమె వాపోయారు. నిర్వాహకులు ఈ కార్యక్రమానికి పిలిచి తనను అమానించినట్టుగా భావించాల్సి వస్తోందని అన్నారు. గతంలో తాను శివసేన (యూబీటీ) నేతలతో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నానని, కానీ ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావడం ఇదే మొదటి సారని అన్నారు. అది కూడా ముఖ్యమంత్రి (ఏక్‌నాథ్ షిండే) ఇలాకాలో జరగడం మహిళల భద్రతపై సందేశాలకు తావిస్తోందని అయోధ్య పోల్ అన్నారు. కాగా, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు చెప్పారు.