Singapore: ఇంట్లోకి దూరి పనిమనిషిపై అత్యాచారం.. భారత సంతతి వ్యక్తికి 18ఏళ్ల జైలు.. 12 కొరడా దెబ్బలు..!
ABN , First Publish Date - 2023-08-09T11:06:31+05:30 IST
పూటుగా తాగి ఓ ఇంట్లోకి దూరడమే కాకుండా ఆ ఇంటి పనిమనిషిపై (Maid) అత్యాచారానికి పాల్పడినందుకు భారత సంతతి వ్యక్తికి సింగపూర్ కోర్ట్ (Singapore Court) 18 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో పాటు 12 కొరడా దెబ్బలు కూడా శిక్షగా విధించినట్లు అక్కడి స్థానిక మీడియా తెలియజేసింది.
సింగపూర్ సిటీ: పూటుగా తాగి ఓ ఇంట్లోకి దూరడమే కాకుండా ఆ ఇంటి పనిమనిషిపై (Maid) అత్యాచారానికి పాల్పడినందుకు భారత సంతతి వ్యక్తికి సింగపూర్ కోర్ట్ (Singapore Court) 18 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో పాటు 12 కొరడా దెబ్బలు కూడా శిక్షగా విధించినట్లు అక్కడి స్థానిక మీడియా తెలియజేసింది. నిందితుడిని 44ఏళ్ల మార్క్ కలైవానన్ తమిళరసన్‌గా (Mark Kalaivanan Tamilarasan) గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు మార్క్ కలైవానన్ 2017 జూలైలో మద్యం మత్తులో (Alcoholic) ఓ ఫ్లాట్‌లోకి చొరబడ్డాడు. అనంతరం ఆ ఇంట్లో బట్టలు ఇస్త్రీ చేస్తున్న పనిమనిషిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాగా, అప్పటికే అత్యాచారం ఆరోపణలపై 16 ఏళ్ల జైలు శిక్షను అనుభవించి విడుదలైన కాసేపటికే ఆ కామాంధుడు ఈ దారుణానికి ఒడిగట్టడం గమనార్హం.
బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి మార్క్ కలైవానన్ కటకటాల్లోనే ఉన్నాడు. తాజాగా ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. దాంతో డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఛ్యూ జిన్ యింగ్, షెల్డన్ లిమ్‌లు నిందితుడిని గరిష్టంగా 20 ఏళ్ల పాటు ప్రివెంటివ్ డిటెన్షన్‌లో (Preventive Detention) ఉంచాలని విచారణ సందర్భంగా న్యాయస్థానాన్ని కోరారు. అయితే, మార్క్ కలైవానన్ రిమాండ్‌లో ఉన్న ఆరేళ్లను పరిగణలోకి తీసుకుని శిక్ష కాలాన్ని తగ్గించాలని అతడి తరుఫు లాయర్లు కోర్టును అభ్యర్థించారు. ఇరువురి వాదోపవాదాలు విన్న కోర్టు చివరికి నిందితుడికి 18 ఏళ్ల జైలుతో పాటు 12 కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తూ తీర్పును వెల్లడించింది.