Kuwait: కువైత్‌లో 34 మంది భారతీయ నర్సులు అరెస్ట్.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-10-05T10:14:40+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ ఉల్లంఘనదారుల కోసం గత కొంతకాలంగా వరుస తనిఖీలు నిర్వహిస్తోంది. ఉల్లంఘనలకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లో దేశంలో ఉండనిచ్చేదిలేదని భద్రతాధికారులు చెబుతున్నారు.

Kuwait: కువైత్‌లో 34 మంది భారతీయ నర్సులు అరెస్ట్.. అసలేం జరిగిందంటే..

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ ఉల్లంఘనదారుల కోసం గత కొంతకాలంగా వరుస తనిఖీలు నిర్వహిస్తోంది. ఉల్లంఘనలకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లో దేశంలో ఉండనిచ్చేదిలేదని భద్రతాధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ప్రవాసులు పనిచేసే చోట్లు, నివాస ప్రాంతాలలో సెక్యూరిటీ అధికారులు క్రమం తప్పకుండా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కువైత్‌ సిటీలోని ఓ ప్రముఖ క్లినిక్‌లో 23 రోజుల కింద తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా అక్కడ పని చేస్తున్న 34 మంది భారతీయ నర్సులతో సహా 60 మంది ప్రవాసులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చాలా మంది భారతీయ నర్సులు గడిచిన 3-4ఏళ్లుగా అక్కడే పని చేస్తున్నట్లు తెలిసింది.

అయితే, తాజాగా అదుపులోకి తీసుకున్న 34 మంది భారత నర్సులను కువైత్ అధికారులు విడుదల చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నర్సులను విడిచిపెట్టారు. వారికి సంబంధించిన బంధువులు, యజమానులు ఉన్నతాధికారులను కలిసి వివరణ ఇవ్వడంతో భారతీయ నర్సులు విడుదలయ్యారు. ఇక అరెస్టైన వారిలో నవజాతశిశువు తల్లితో పాటు చిన్నపిల్లల అమ్మలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సెప్టెంబర్ 12వ తారీఖున కువైత్ సిటీలోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో భద్రతాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా వీరు పట్టుబడ్డారు.

అయితే, ఆ తర్వాత వారి బంధువులు వారంతా చట్టబద్ధంగానే దేశంలో ఉంటున్నట్లు ఉన్నతాధికారులకు వారి తాలూకు ధృవపత్రాలు చూపించడంతో విడిచిపెట్టారు. అంతకుముందు భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్, కువైత్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ భారతీయుల విడుదల కోసం జోక్యం చేసుకున్నట్లు తెలిసింది.

Kuwait: అన్నంత పని చేస్తున్న కువైత్.. 800 మంది ప్రవాసులు సర్వీస్ నుంచి తొలగింపు!

Updated Date - 2023-10-05T10:14:40+05:30 IST