Kuwait: అన్నంత పని చేస్తున్న కువైత్.. 800 మంది ప్రవాసులు సర్వీస్ నుంచి తొలగింపు!
ABN , First Publish Date - 2023-10-04T09:09:00+05:30 IST
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) అన్నంత పని చేస్తోంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రవాసులపై వేటు వేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో భారీ మొత్తంలో ప్రక్షాళన మొదలెట్టింది.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) అన్నంత పని చేస్తోంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రవాసులపై వేటు వేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో భారీ మొత్తంలో ప్రక్షాళన మొదలెట్టింది. దీనికోసం ఐదేళ్ల కింద కువైత్ సర్కార్ కువైటైజేషన్ పాలసీ (Kuwaitization Policy) ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాలసీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌లోని అన్నీ విభాగాలలో కువైటీలకు భారీగా ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. దాంతో ఇప్పటివరకు కువైత్‌లో భారీగా ఉపాధి పొందుతున్న ప్రవాసులు (Expatriates) అదే స్థాయిలో ఉద్యోగాలు కోల్పోతున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior) ఏకంగా 800 మందికి పైగా ప్రవాస ఉద్యోగులను సర్వీస్ నుంచి తొలగించింది. వీరందరూ పరిపాలన విభాగంలో పని చేస్తున్నవారు. అంతేగాక వారిలో కొందరు కీలకమైన న్యాయ సలహాదారులుగా పని చేస్తున్నవారు కూడా ఉండడం గమనార్హం. ఇక సర్వీస్ నుంచి తొలగించబడిన వారిలో ఎక్కువ మంది అరబ్ జాతీయులని (Arab Nationals) సమాచారం.
కాగా, అక్కడి మీడియాలో పేర్కొన్న నివేదికల ప్రకారం తొలగించబడిన 800 మంది మొదటి బ్యాచ్ అని, రాబోయే నెలల్లో మరో బ్యాచ్‌ను సేవల నుంచి తొలగించేందుకు మంత్రిత్వశాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలాఉంటే.. ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ (Traffic Department) వంటి సున్నితమైన రంగాలలో ప్రవాస కార్మికులను (Expat Workers) భర్తీ చేయడమే లక్ష్యంగా మినిస్ట్రీ ముందుకు వెళ్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.