Kuwait: 10 నెలల్లో 4లక్షలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు.. 18వేల మంది ప్రవాసుల దేశ బహిష్కరణ.. కువైత్ కీలక నిర్ణయం!
ABN , First Publish Date - 2023-11-28T08:38:28+05:30 IST
దేశవ్యాప్తంగా అంతకంతకు పెరిగిపోతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలను (Traffic Violations) అడ్డుకట్ట వేసేందుకు తాజాగా కువైత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ జరిమానాలను భారీగా పెంచనున్నట్లు వెల్లడించింది.
కువైత్ సిటీ: దేశవ్యాప్తంగా అంతకంతకు పెరిగిపోతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలను (Traffic Violations) అడ్డుకట్ట వేసేందుకు తాజాగా కువైత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ జరిమానాలను భారీగా పెంచనున్నట్లు వెల్లడించింది. 4.6 మిలియన్ల జనాభా కలిగిన కువైత్‌లో గడిచిన పది నెలల్లో ఏకంగా 4.31లక్షల ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు కావడం గమనార్హం. అంటే.. రోజుకు సగటున 1,400 ఉల్లంఘనలు. అలాగే ఈ 10 నెలల వ్యవధిలో ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా 165 మంది మరణించారు. ఇక ట్రాఫిక్ ఉల్లంఘనల తాలూకు కేసులు కూడా కోర్టులో అదే స్థాయిలో రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు ఏకంగా 15,556 ట్రాఫిక్ కేసులు కోర్టుకు వచ్చాయి. ఈ కేసులకు గాను న్యాయస్థానం ఉల్లంఘనదారులకు ఏకంగా 2.50 లక్షల కువైటీ దినార్ల (రూ.6.76కోట్లు) జరిమానా విధించింది.
NRIs: భారత పర్యాటకులకు తీపి కబురు.. వీసా ఫ్రీ ఎంట్రీకి మరో దేశం గ్రీన్ సిగ్నల్..!
కాగా, రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలను నియంత్రించేందుకు ఇప్పటికే కువైత్ సర్కార్ పలు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే ఇటీవల కువైత్ అధికారులు డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక ప్రవాసులు (Expats) ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే సంబంధిత అధికారులు ఏకంగా దేశం నుంచే బహిష్కరిస్తున్నారు. ఇలా గడిచిన ఆరు నెలల్లో 18వేల మందికి పైగా ప్రవాసులను దేశం నుంచి వెళ్లగొట్టింది కువైత్ సర్కార్. ఈ ఏడాది మార్చి నుండి ఆగస్టు వరకు వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన 18,486 మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించడం జరిగిందని ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ చీఫ్ నవాఫ్ అల్ హయాన్ (Nawaf Al Hayan) చెప్పారు.
Kuwait: 226 మంది ప్రవాసులు అరెస్ట్.. అసలు కువైత్‌లో ఏం జరుగుతోంది..!
అలాగే కువైత్ అధికారులు జనవరి-ఆగస్టు మధ్య కాలంలో ఏకంగా 34,751 మంది ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్‌లను (Driving licences) క్యాన్సిల్ చేశారు. ఇదిలాఉంటే.. ఈ ఏడాది ప్రారంభంలో అంతర్గత మంత్రిత్వ శాఖ (Interior Ministry) కువైత్ మొత్తం జనాభాలో దాదాపు 3.2 మిలియన్ల మంది ఉన్న విదేశీయులను దేశం విడిచి వెళ్ళే ముందు వారు బకాయి పడ్డ ట్రాఫిక్ జరిమానాలన్నింటినీ క్లియర్ చేయమని హెచ్చరించిన విషయం తెలిసిందే.