Donald Trump Arrest: అమెరికా చరిత్రలోనే ఇదే తొలిసారి.. ఏ తప్పూ చేయలేదంటూ వాదన.. చివరకు విడుదల

ABN , First Publish Date - 2023-04-05T07:29:21+05:30 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు, 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్టయ్యారు.

Donald Trump Arrest: అమెరికా చరిత్రలోనే ఇదే తొలిసారి.. ఏ తప్పూ చేయలేదంటూ వాదన.. చివరకు విడుదల

హష్‌మనీ కేసులో 34 నేరారోపణలు

మన్‌హటన్‌ అటార్నీ కోర్టులో లొంగుబాటు

ఏ తప్పూ చేయలేదని వాదించిన ట్రంప్‌

తనను దోషిగా ప్రకటించవద్దని విజ్ఞప్తి

నేరారోపణలను ఆమోదించిన కోర్టు

ఆ వెంటనే సంతకాలు, వేలిముద్రల సేకరణ

పోలీసు కస్టడీకి అమెరికా మాజీ అధ్యక్షుడు

కోర్టు బయట, న్యూయార్క్‌లో ఆందోళనలు

విచారణ అనంతరం కోర్టు నుంచి వెళ్లిపోయిన ట్రంప్

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 4: అమెరికా మాజీ అధ్యక్షుడు, 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్టయ్యారు. అమెరికా చరిత్రలోనే మాజీ అధ్యక్షుడు అరెస్టవ్వడం ఇదే మొదటిసారి. 2016 నాటి హష్‌మనీ కేసులో ఆయనపై మన్‌హటన్‌ కోర్టులో 30 అభియోగాలు నమోదవ్వగా.. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన కోర్టులో లొంగిపోయారు. ఆయన కోర్టు హాలుకు చేరుకోగానే పోలీసులు ట్రంప్‌ను తమ కస్టడీలోకి తీసుకుని, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. డొనాల్డ్‌ ట్రంప్‌ 2006లో లేక్‌తాహో హోటల్‌లో స్టార్మీ డేనియల్స్‌ అనే నటితో శృంగారంలో పాల్గొన్నాడనే ఆరోపణలున్నాయి. స్వయంగా డేనియల్స్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ట్రంప్‌ను ఓ కార్యక్రమంలో కలుసుకున్నానని, ఆ తర్వాత హోటల్‌లో శృంగారంలో పాల్గొన్నానని ఆమె చెప్పారు. 2016 అధ్యక్ష ఎన్నికలకు నెల రోజుల ముందు ట్రంప్‌ ఈ విషయంలో ఆమె నోటికి తాళం వేయాలని నిర్ణయించినట్లు మన్‌హటన్‌ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి.

ట్రంప్‌ వ్యక్తిగత అడ్వొకేట్‌ కోహెన్‌ ద్వారా డేనియల్స్‌కు 1.30 లక్షల అమెరికా డాలర్లు ముట్టజెప్పినట్లు ప్రాసిక్యూషన్‌ వాదనలు వినిపించింది. కోహెన్‌ దీన్ని నిర్ధారించారు. ఇప్పుడు మన్‌హటన్‌ కోర్టులో ఈ వ్యవహారంపై 34 నేరారోపణలు ఉన్నట్లు సీఎన్‌ఎన్‌ వార్తాసంస్థ వెల్లడించింది. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ట్రంప్‌ అరెస్టు విషయం కోర్టు బయటకు వచ్చింది. కడపటి వార్తలందేసరికి.. న్యూయార్క్‌ పోలీసులు ట్రంప్‌ను తమ కస్టడీకి తీసుకున్నారు. ఆయన వేలిముద్రలు, ఫొటోలను తీసుకునే ప్రక్రియ కొనసాగుతున్నట్లు వార్తాసంస్థలు తెలిపాయి. ట్రంప్‌ను సాంకేతికంగా అరెస్టు చేసినా, ఆయనకు బేడీలు వేయలేదని పేర్కొన్నాయి. ట్రంప్‌ కోర్టుకు హాజరయ్యే ముందే.. ఆయన అభిమానులు న్యూయార్క్‌లో, ట్రంప్‌టవర్‌, మన్‌హటన్‌ కోర్టు వద్ద ఆందోళనలు చేపట్టారు. అభిమానుల నిరసనల మధ్యే ట్రంప్‌ కోర్టుకు చేరుకున్నారు.

Trump.jpg

నేను ఏ పాపం చేయలేదు: ట్రంప్‌

మంగళవారం మధ్యాహ్నం కోర్టులో లొంగిపోయిన ట్రంప్‌.. తాను డేనియల్‌ను కలిసిన విషయం వాస్తవమేనని, అయితే ఆమెతో లైంగిక సంబంధాలు లేవని వాదనలు వినిపించారు. కోహెన్‌ వాంగ్మూలం, డేనియల్‌ ప్రకటనలను న్యూయార్క్‌ సుప్రీంకోర్టు జడ్జి మెర్చన్‌ ప్రస్తావించగా.. వాటిని ట్రంప్‌ ఖండించారు. తనకేపాపం తెలియదని, తనను దోషిగా ప్రకటించవద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కాగా, విచారణ అనంతరం ట్రంప్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని మార్ ఏ లాగో నివాసానికి తిరిగి వెళ్లిపోయారు.

Updated Date - 2023-04-05T07:34:23+05:30 IST