Kuwait’s New Residency Law: వీసా రెన్యువల్‌కు కొత్త షరతు.. ప్రవాసులు ఇకపై..

ABN , First Publish Date - 2023-09-10T09:29:02+05:30 IST

ప్రవాసులు తమ వీసా రెన్యువల్ (Visa Renewal) చేసుకునేందుకు గల్ఫ్ దేశం కువైత్ కొత్త షరతు విధించింది. ఇకపై వీసా పునరుద్ధరణకు వలసదారులు తమ అప్పులు, జరిమానాలు, ఇతర బకాయిలు చెల్లించడం తప్పనిసరి చేసింది.

Kuwait’s New Residency Law: వీసా రెన్యువల్‌కు కొత్త షరతు.. ప్రవాసులు ఇకపై..

కువైత్ సిటీ: ప్రవాసులు తమ వీసా రెన్యువల్ (Visa Renewal) చేసుకునేందుకు గల్ఫ్ దేశం కువైత్ కొత్త షరతు విధించింది. ఇకపై వీసా పునరుద్ధరణకు వలసదారులు తమ అప్పులు, జరిమానాలు, ఇతర బకాయిలు చెల్లించడం తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం ఆదివారం (10వ తేదీ) నుంచి అమలులోకి వస్తుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ (Ministry of Interior) వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది కూడా. అందుకే ఇకపై ప్రవాసులు తమ రెసిడెన్సీ పర్మిట్లను (Residency Permits) రెన్యువల్ చేసుకోవాలంటే పాత బకాయిలు చెల్లించాల్సిందే. తాత్కాలిక ప్రధాని, అంతర్గత మంత్రిత్వశాఖ మంత్రి షేక్ తలాల్ ఖలీద్ అల్ అహ్మద్ అల్ సభా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

ఇక సెటిల్‌మెంట్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఆన్‌లైన్ (Online) విధానాన్ని తీసుకువచ్చింది. తమ రెసిడెన్సీ పర్మిట్‌లను పునరుద్ధరించాలనుకునే ప్రవాసులు (Expats) సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీల అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా లేదా 'సహెల్ అప్లికేషన్‌' (Sahel App)ని ఉపయోగించడం ద్వారా తమ అప్పులను క్లియర్ చేయాల్సి ఉంటుంది. అంతర్గత మంత్రిత్వ శాఖ పరిధిలోని చట్టపరమైన నిబంధనలకు ప్రవాసులు కట్టుబడి ఉండాలని, ఎట్టిపరిస్థితుల్లో ఈ నిబంధనలను ఉల్లంఘించవద్దని అధికారులు తెలిపారు. ఇది దేశంలో భద్రత, ప్రజా క్రమాన్ని కాపాడటంలో ఎంతో సహాకరిస్తుందని నొక్కి చెప్పారు. ఈ చొరవ బాధ్యతాయుతమైన ఆర్థిక విధానాల పట్ల ప్రభుత్వ అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందని, దేశం మొత్తం స్థిరత్వం మరియు భద్రతకు దోహదం చేస్తుందని మంత్రిత్వశాఖ చెప్పుకొచ్చింది.

Kuwait: కువైత్‌లో చిక్కుకున్న భారత కార్మికులు.. ఎట్టకేలకు స్వదేశానికి..


Updated Date - 2023-09-10T09:29:02+05:30 IST