Kuwait: ప్రవాసులూ జర జాగ్రత్త.. ఆ ట్యాక్సీ డ్రైవర్లను తక్షణమే దేశం నుంచి వెళ్లగొట్టాలని కువైత్ నిర్ణయం!
ABN , First Publish Date - 2023-10-11T07:39:38+05:30 IST
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కువైత్ అంతర్జాతీయ విమానాశ్రయం (Kuwait International Airport) నుండి ప్రయాణీకులను పికప్ చేసుకుంటున్న అక్రమ డ్రైవర్లను తక్షణమే దేశం నుంచి బహిష్కరించాలని నిర్ణయించింది.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కువైత్ అంతర్జాతీయ విమానాశ్రయం (Kuwait International Airport) నుండి ప్రయాణీకులను పికప్ చేసుకుంటున్న అక్రమ డ్రైవర్లను తక్షణమే దేశం నుంచి బహిష్కరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ తాత్కాలిక ప్రధాని, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ మంత్రి షేక్ తలాల్ అల్-ఖలేద్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఎయిర్‌పోర్టులో తనిఖీలు కఠినతరం చేయాలని సూచించారు. విమానాశ్రయంలో క్రమం తప్పకుండా సోదాలు నిర్వహించడం, అక్రమ డ్రైవర్ల (Illegal drivers) ను గుర్తించి అదుపులోకి తీసుకోవడంతో పాటు వెంటనే దేశం నుంచి వెళ్లగొట్టాలని (Immediate deportation) ఆదేశించారు.
ఈ నేపథ్యంలోనే బుధవారం నుంచి ఎయిర్‌పోర్ట్‌లో ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను 24 గంటలు మోహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక అక్కడి స్థానిక అరబిక్ మీడియా నివేదిక ప్రకారం ప్రవాస డ్రైవర్లు (Expat drivers) ప్రయాణీకులను (Passengers) చట్టవిరుద్ధంగా పికప్ చేయడం ద్వారా ఆ విమానాశ్రయ ట్యాక్సీ యజమానుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఎయిర్‌పోర్ట్ టాక్సీ డ్రైవర్ల ఫిర్యాదు మేరకు తాజాగా కువైత్ ఈ నిర్ణయం తీసుకుంది.