Kuwait: కువైత్‌కు రికార్డు స్థాయిలో పెరిగిన భారత్ ఎగుమతులు
ABN , First Publish Date - 2023-10-10T12:38:19+05:30 IST
2022-23 ఆర్థిక సంవత్సరంలో కువైత్‌కు ఇండియా ఎగుమతులు భారీగా పెరిగాయి. ఏకంగా 25.6శాతం మేర పెరిగినట్లు తాజాగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (Federation of Indian Export Organisations) వెల్లడించింది.
కువైత్ సిటీ: 2022-23 ఆర్థిక సంవత్సరంలో కువైత్‌కు ఇండియా ఎగుమతులు భారీగా పెరిగాయి. ఏకంగా 25.6శాతం మేర పెరిగినట్లు తాజాగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (Federation of Indian Export Organisations) వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కువైత్‌కు భారతీయ ఎగుమతులు 1.24 బిలియన్ డాలర్లుగా ఉంటే.. ప్రస్తుతం అది 1.56 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఎఫ్ఐఈఓ (FIEO) తెలిపింది. ఈ వృద్ధి ఇరు దేశాల మధ్య బలమైన వాణిజ్య భాగస్వామ్యానికి నిదర్శనమని పేర్కొంది. ఈ మేరకు తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా ప్రకటించింది. ఇక సెప్టెంబర్ ప్రారంభంలో కువైత్‌లోని భారత రాయబారి ఆదర్శ్ స్వైకా (Adarsh Swaika) మాట్లాడుతూ.. భారత్-కువైత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి (12.5 బిలియన్ డాలర్లు) చేరుకుందని చెప్పారు. కాగా, కువైత్‌కు బియ్యం, చక్కెర, సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్ వస్తువులతో సహా అనేక రకాల వస్తువులను ఇండియా ఎగుమతి చేస్తున్న విషయం విదితమే. అదే సమయంలో కువైత్ నుంచి మనకు భారీ మొత్తంలో ముడి చమురు దిగుమతి అవుతోంది.