Dr Vivek Murthy: రోజుకి 15 సిగరెట్లు తాగడం కంటే కూడా.. అది చాలా ప్రమాదకరం.. విస్తుగొలిపే విషయాలు వెల్లడించిన భారతీయ సర్జన్ జనరల్..!
ABN , First Publish Date - 2023-05-05T09:36:55+05:30 IST
ప్రస్తుతం మానవ సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.
ఎన్నారై డెస్క్: ప్రస్తుతం మానవ సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఉమ్మడి కుటుంబాల జాడలేకుండా పోతోంది. ఎవరికి వారు స్వేచ్ఛ పేరుతో ఎక్కడికక్కడ గోడలు కట్టేసుకుంటున్నారు. చివరకు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం, సోషల్ మీడియా రాక కారణాలేవైనా సరే మానవ సంబంధాలను తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి. ఇప్పుడు యువత నుంచి వృద్ధుల వరకు అంతా ఒంటరితనం బాధితులే. అయితే, ఇక్కడ ఓ షాకింగ్ విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. వృద్ధుల కంటే కూడా 22 ఏళ్లలోపు వయసు గల యువతే అత్యధికంగా ఒంటరితనంతో బాధపడుతున్నట్లు తాజాగా బయటకు వచ్చిన వివిధ సర్వే నివేదికలు వెల్లడించాయి. ప్రతి ఐదుగురిలో ఒకరు తమకు అప్యాయంగా మాట్లాడేందుకు సన్నిహితులే లేరని భావిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఇదే విషయమై భారత సంతతికి చెందిన అమెరికా సర్జన్ జనరల్ డా. వివేక్ మూర్తి (Indian origin US Surgeon General Dr Vivek Murthy) విస్తుగొలిపే విషయాలు వెల్లడించారు.
ప్రతిరోజూ పదిహేను సిగరెట్స్ కాల్చే వారితో పోలిస్తే ఒంటరితనంతో బాధపడుతున్న వారే ప్రమాదానికి అత్యంత చేరువలో ఉన్నట్టు అని ఆయన తెలిపారు. అగ్రరాజ్యంలోని పెద్దలలో సగం మంది తాము ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్లు చెప్పారని సర్జన్ జనరల్ (Surgeon General) పేర్కొన్నారు. దీనికి సంబంధించి సర్జన్ జనరల్ ఆఫీస్ ఏకంగా 81 పేజీలతో కూడిన ప్రత్యేక రిపోర్టును రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా వివేక్ మూర్తి మాట్లాడారు. ఒంటరితనం అనేది కూడా శరీరం, మనసు అనుభవించే ఒక సాధారణ అనుభూతి. ఇది కూడా ఆకలి, దాహం లాంటిదేనని ఆయన పేర్కొన్నారు. మన మనుగడకు అవసరమైనది దొరకనప్పుడు శరీరం మనకు కొన్ని సిగ్నల్స్ పంపుతున్న తరహాలోనే ఒంటరితనం (Loneliness) కూడా అని సర్జన్ జనరల్ చెప్పుకొచ్చారు. ఇక యూఎస్‌లో లక్షలాది మంది ఇలా ఒంటరితనంతో బాధపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ సమస్యను పరిష్కరించే దిశగా డిక్లరేషన్ ప్రోగ్రామ్‌ను (Declaration Program) తీర్చిదిద్దిన్నట్లు వివేక్ మూర్తి తెలియజేశారు. ఇక పని ప్రదేశాలు, ఎడ్యుకేషనల్ ఇన్సిస్టిట్యూషన్స్, కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌లు మనుషుల మధ్య అనుసంధానాన్ని పెంచే చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సర్జన్ జనరల్ కోరారు.
Kuwait: పాపం.. ఈ భారతీయ జంటకు ఏడాది క్రితమే పెళ్లయింది.. కానీ, ఏమైందో ఏమో.. తెల్లవారు ఝామున చూస్తే వారి నివాసంలో షాకింగ్ సీన్..!
కాగా, 2020లో మహమ్మారి కరోనా విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన కోవిడ్-19 (Covid-19) నిబంధనల కారణంగా మిలియన్ల మంది అమెరికన్లు మిత్రులకు, బంధువులకు దూరంగా ఇంట్లో ఒంటరిగా ఉండిపోవాల్సి వచ్చిందని నివేదిక పేర్కొంది. 2020లో అమెరికన్లు తమ స్నేహితులతో రోజుకు 20 నిమిషాలు మాత్రమే వ్యక్తిగతంగా గడిపితే.. ఇది రెండు దశాబ్ధాల క్రితం రోజుకి ఒక గంటగా ఉండేదని తెలిపింది. ప్రధానంగా 15- 24 ఏళ్ల మధ్య వయసు గల యువతను ఒంటరితనం తీవ్రంగా వేధిస్తోందని నివేదిక గణాంకాలు చెబుతున్నాయి. అలాగే రోజుకు 2గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం సామాజిక మాధ్యమాల్లో గడిపే వ్యక్తులు సామాజికంగా ఒంటరిగా ఉన్నట్లు రిపోర్ట్ పేర్కొంది. ఇక ఒంటరితనం అనేది అకాల మరణం ప్రమాదాన్ని సుమారు 30 శాతం పెంచడంతో పాటు హృదయ సంబంధిత రోగాలు వచ్చే ప్రమాదం పొంచి ఉంటుందని నివేదిక వార్న్ చేసింది.