'నేను భారత్ రాలేను.. మృతదేహాన్ని మున్సిపాలిటీకి అప్పగించండి'.. సోదరుడు మృతిచెందాడని ఫోన్ చేస్తే.. కువైత్‌లో ఉంటున్న సోదరి అన్నమాటలు ఇవి..

ABN , First Publish Date - 2023-04-27T12:35:38+05:30 IST

ఫుట్‌పాత్‌పై జీవిస్తున్న ఓ వ్యక్తి మృతిచెందాడు.

'నేను భారత్ రాలేను.. మృతదేహాన్ని మున్సిపాలిటీకి అప్పగించండి'.. సోదరుడు మృతిచెందాడని ఫోన్ చేస్తే.. కువైత్‌లో ఉంటున్న సోదరి అన్నమాటలు ఇవి..

బంజారహిల్స్, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): ఫుట్‌పాత్‌పై జీవిస్తున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు కువైత్‌లో ఉన్న అతడి సోదరికి ఫోన్ చేసి విషయం చెప్పారు. తాను భారత్ రాలేనని మృతదేహాన్ని జీహెచ్ఎంసీకి అప్పగించాలని ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా తిరుపతిలోని క్రాంతి నగర్‌కు చెందిన పవన్ కుమార్ మహా నంది(37) కొంత కాలంగా నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్.14లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వద్ద ఫుట్‌పాత్‌పై జీవిస్తున్నాడు. దాతలు ఇచ్చేది తింటూ కడుపు నింపుకుంటున్నాడు. తీవ్రంగా కడుపునొప్పి రావడంతో బుధవారం మృతిచెందాడు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు.

అనంతరం మృతుడి బ్యాగులో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా తిరుపతిలో ఆరా తీయగా, సోదరి కువైత్‌లో ఉన్నట్లు తెలిసింది. బంజారాహిల్స్ ఎస్సై కరుణాకర్ రెడ్డి కువైత్‌లో ఉన్న మృతుడి సోదరితో ఫోన్‌లో మాట్లాడారు. పవన్ కుమార్ మహానంది మృతదేహాన్ని ఉస్మాని మార్చురీలో భద్రపర్చామని, తీసుకెళ్లడానికి ఎవరినైనా పంపాలని కోరారు. అంత్యక్రియలు చేయడానికి ఎవరూ అందుబాటులో లేరని, 'నేను భారత్ రాలేనని మృతదేహాన్ని మున్సిపాలిటీకి' అప్పగించాల్సిందిగా ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేసింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-04-27T12:35:38+05:30 IST