Indian: సౌదీ నుంచి స్వదేశానికి భారత వ్యక్తి.. రూ.2కోట్లు పరిహారం చెల్లించిన కుటుంబం.. అసలేం జరిగిందంటే..!
ABN , First Publish Date - 2023-09-08T13:42:09+05:30 IST
సౌదీ అరేబియా నుంచి క్షేమంగా తిరిగి వస్తాడని కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న భారత్‌కు చెందిన బల్వీందర్ సింగ్ (36) కుటుంబం నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది.
ఎన్నారై డెస్క్: సౌదీ అరేబియా నుంచి క్షేమంగా తిరిగి వస్తాడని కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న భారత్‌కు చెందిన బల్వీందర్ సింగ్ (36) కుటుంబం నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. పంజాబ్ రాష్ట్రం ముక్తసర్ జిల్లా గిద్దర్‌బాహాలోని మల్లన్ గ్రామానికి చెందిన బల్వీందర్ 2008లో ఉపాధి కోసం సౌదీ అరేబియా (Saudi Arabia) కు వెళ్లాడు. ఈ క్రమంలో 2013లో జరిగిన ఓ ఘర్షణలో సౌదీ వ్యక్తిని చంపేశాడు. దాంతో దోషిగా తేలిన అతనికి సౌదీ న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత మృతుడి కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారం (Blood money) చెల్లించాలని, లేదంటే శిరచ్ఛేదం చేయాలని కోర్టు ఆదేశించింది. గత మే నెలలో అతని కుటుంబం ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఆ మొత్తాన్ని ఏర్పాటు చేసి సౌదీ ప్రభుత్వానికి చెల్లించింది. దాంతో బల్వీందర్‌ను రియాద్‌లోని జైలు నుండి విడుదల చేసి కొత్వాలికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
“డబ్బు చెల్లించిన తర్వాత కూడా బల్వీందర్ 16 నెలల వరకు విడుదల కాలేదు. అతణ్ని విడుదల చేసి భారత్‌కు తిరిగి పంపుతున్నట్లు ఈరోజు బల్వీందర్ నుండి మాకు కాల్ వచ్చింది. అతను సురక్షితంగా తిరిగి రావడానికి ప్రార్థన చేసిన, డబ్బు అందించిన ప్రతి ఒక్కరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాకు చాలా సహాయం చేసిన ఎస్పీఎస్ ఒబెరాయ్‌కు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆయన రూ. 20 లక్షలు కూడా ఇచ్చారు” అని బల్వీందర్ బంధువు హర్దీప్ సింగ్ అన్నారు. శుక్రవారం ఉదయం బల్వీందర్ ఢిల్లీ విమానాశ్రయానికి వస్తాడని, అక్కడి నుంచి అమృత్‌సర్ చేరుకుంటాడని తెలిపారు.