Kuwait: ప్రవాసుల విషయంలో తెరపైకి కొత్త ప్రతిపాదన.. అమల్లోకి వస్తే వలసదారుల పంట పండినట్టే..!
ABN , First Publish Date - 2023-05-17T07:31:54+05:30 IST
గల్ఫ్ దేశం కువైత్‌లో ప్రవాసుల విషయంలో తెరపైకి ఓ కొత్త ప్రతిపాదన వచ్చింది. కువైత్‌లోని నాన్-కువైటీలకు రెసిడెన్షియల్ ప్రాపర్టీలను సొంతం చేసుకోవడానికి అనుమతించాలని కువైత్ మంత్రివర్గ కమిటీ తాజాగా క్యాబినెట్‌కు ప్రతిపాదన పంపింది.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లో (Kuwait) ప్రవాసుల విషయంలో తెరపైకి ఓ కొత్త ప్రతిపాదన వచ్చింది. కువైత్‌లోని నాన్-కువైటీలకు రెసిడెన్షియల్ ప్రాపర్టీలను సొంతం చేసుకోవడానికి అనుమతించాలని కువైత్ మంత్రివర్గ కమిటీ తాజాగా క్యాబినెట్‌కు ప్రతిపాదన పంపింది. ఇక ఈ ప్రతిపాదన కనుక ఆమోదం పొందితే.. ఒక నివాస అపార్ట్‌మెంట్‌ను సొంతం (Own Apartments) చేసుకునే హక్కును కువైటీయేతర వ్యక్తికి లభిస్తుంది. దరఖాస్తుదారు కువైత్‌లో శాశ్వత, చట్టబద్ధమైన నివాసి అయితే, ఆ వ్యక్తి దేశంలో ఉన్నంత కాలం అతనిపై గౌరవం లేదా నమ్మకాన్ని ఉల్లంఘించే ఎలాంటి తీర్పులు జారీ చేయడానికి వీలు ఉండదు.
అపార్ట్‌మెంట్‌ను దరఖాస్తుదారు లేదా అతని కుటుంబం నివాసం కోసం కేటాయించాలని ఈ ప్రపోజల్ నిర్దేశిస్తుంది. జూన్ 6న జాతీయ అసెంబ్లీ ఎన్నికల అనంతరం రెండు వారాల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వంపై చర్చల సందర్భంగా ఈ ప్రతిపాదన కువైత్ క్యాబినెట్‌లో (Kuwait Cabinate) చర్చించబడుతుంది. ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడం, దేశాన్ని విడిచిపెట్టే బదులు కువైత్‌కు డబ్బును ఆకర్షించడం ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ఆలోచనగా తెలుస్తోంది. ఏదేమైనా ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే మాత్రం ప్రవాసులకు ఆ దేశంలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు, సొంత ప్రాపర్టీలు కలిగి ఉండటానికి అవకాశం కల్పిస్తుంది.