Saudi Arabia: సౌదీలో స్కూల్ విద్యార్థినికి 18ఏళ్ల జైలు.. ఇంతకీ ఆమె చేసిన నేరమేంటంటే..
ABN , First Publish Date - 2023-09-26T11:58:33+05:30 IST
గల్ఫ్ దేశాలలో (Gulf Countries) చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కొన్నిసార్లు మనకు తెలియకుండా చేసే పొరపాటుకు సైతం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
రియాద్: గల్ఫ్ దేశాలలో (Gulf Countries) చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కొన్నిసార్లు మనకు తెలియకుండా చేసే పొరపాటుకు సైతం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే ఆ దేశాలకు వెళ్లేముందు అక్కడి నియమనిబంధనలపై ఎంతోకొంత అవగాహన కలిగి ఉండడం బెటర్. అందులోనూ సోషల్ మీడియా (Social Media) విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అక్కడి చాలా దేశాల్లో సోషల్ మీడియా వాడకంపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. వాటిపై అవగాహన లేకుంటే మాత్రం జైలు, భారీ జరిమానాలు తప్పవు. ఇదే కోవలో తాజాగా సౌదీ అరేబియా (Saudi Arabia) లో ఓ ఘటన చోటు చేసుకుంది.
ఒక స్కూల్ విద్యార్థిని (Schoolgirl) చేసిన పొరపాటు ఆమెను ఏకంగా 18 ఏళ్లపాటు కటకటాల వెనక్కి వెళ్లేలా చేసింది. తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా రాజకీయ ఖైదీలకు (Political prisoners) మద్దతుగా విద్యార్థిని చేసిన ట్వీట్ ఆమెను ఇలా దీర్ఘకాలం జైలుపాలు చేసింది. సౌదీ స్పెషలైజ్డ్ క్రిమినల్ కోర్ట్ ఆగస్టులో మనల్ అల్-గఫిరీకి శిక్షను విధించిందని సౌదీలో మానవ హక్కుల ఉల్లంఘనలను డాక్యుమెంట్ చేసే ఏఎల్‌క్యూఎస్‌టీ (ALQST) హక్కుల సంఘం శుక్రవారం వెల్లడించింది. కాగా, శిక్షపడిన విద్యార్థిని వయసు కేవలం 17 ఏళ్లు అని తెలిసింది.
ఇదిలాఉంటే.. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పాలనలో సౌదీ న్యాయవ్యవస్థ (Saudi Judiciary).. సైబర్ యాక్టివిజం, ప్రభుత్వాన్ని విమర్శించడానికి సోషల్ మీడియాను ఉపయోగించడంపై అనేక తీవ్రమైన జైలు శిక్షలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ట్విట్టర్, యూట్యూబ్ (YouTube)లో చేసిన వ్యాఖ్యలకు రిటైర్డ్ అధ్యాపకుడైన మొహమ్మద్ అల్-గమ్దీకి ఇటీవల మరణశిక్ష (Death penalty) విధించడం జరిగింది. అలాగే లీడ్స్ యూనివర్శిటీ డాక్టరల్ అభ్యర్థి సల్మా అల్-షెహాబ్‌కు గతేడాది ఆయన చేసిన కొన్ని అభ్యంతరకర ట్వీట్లపై ఏకంగా 34 ఏళ్ల జైలు శిక్ష పడింది.