Kuwait: తగ్గేదేలే అంటున్న కువైత్.. 2023లో భారీగా పెరిగిన ప్రవాస ఉద్యోగుల తొలగింపు.. అత్యధికులు మనోళ్లే..!
ABN , First Publish Date - 2023-07-18T08:37:59+05:30 IST
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గత కొన్నేళ్లుగా ప్రవాస ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహారిస్తోంది.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గత కొన్నేళ్లుగా ప్రవాస ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహారిస్తోంది. కువైటైజేషన్ పాలసీ పేరిట భారీ మొత్తంలో ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అంతకంతకు పెరిగిపోతున్న వలస కార్మికుల ప్రాబల్యాన్ని తగ్గించి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ఐదేళ్ల కింద కువైత్ ప్రభుత్వం కువైటైజేషన్ పాలసీ (Kuwaitization Policy) ని తీసుకొచ్చింది. గడిచిన రెండేళ్ల నుంచి ఈ పాలసీని కఠినంగా అమలు చేస్తూ వస్తోంది. దీంతో అటు ప్రైవేట్ రంగంతో పాటు ఇటు ప్రభుత్వ రంగంలో కూడా భారీగానే ప్రవాస ఉద్యోగులను తొలగించడం చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే 2023 మొదటి అర్ధ భాగంలో కూడా భారీ మొత్తంలోనే ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులను తొలగించినట్లు తాజాగా వెలువడిన అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ గణాంకాల ప్రకారం 10వేలకు పైగా ప్రవాసులను ఉద్యోగాల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఇక ఉద్యోగాల నుంచి తొలగించిన వారిని వెంటనే దేశం నుంచి బహిష్కరించడం (Deportation) చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 1,000 మంది వరకు ప్రవాసులు బహిష్కరణ కేంద్రంలో ఉన్నారు. వీరిని ఈ నెలాఖరు వరకు దేశం నుంచి పంపించే ఏర్పాట్లు చేసింది.
Kuwait: కువైత్‌లోని ప్రవాసులకు హెచ్చరిక.. అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలంటూ మినిస్ట్రీ వార్నింగ్..!
కాగా, ఇలా బహిష్కరణలకు గురవుతున్న వలసదారులలో అత్యధికులు భారతీయ ప్రవాసులే (Indian Expats) ఉన్నారు. మన తర్వాతి స్థానంలో ఫిలిప్పీయన్స్, శ్రీలంక జాతీయులు, ఈజిప్టియన్లు, బంగ్లాదేశీయులు ఉన్నారు. ఇదిలాఉంటే.. అధికారిక గణాంకాల ప్రకారం 2022లో 2.50లక్షల మంది ప్రవాసులు కువైత్‌ను శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్లిపోయారు. వీరిలో 7వేల మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం గమనార్హం.