SalamAir: భారతీయ ప్రయాణికులకు ఒమాన్ ఎయిర్‌లైన్ షాక్.. అక్టోబర్ 1వ తారీఖు నుంచి అన్ని సర్వీసులు బంద్!
ABN , First Publish Date - 2023-09-23T09:35:41+05:30 IST
ఒమాన్ తొలి బడ్జెట్ ఎయిర్‌లైన్ సలామ్ ఎయిర్ (SalamAir) భారతీయ ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్ చెప్పింది. అక్టోబర్ 1వ తారీఖు నుంచి భారత్‌కు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
మస్కట్: ఒమాన్ తొలి బడ్జెట్ ఎయిర్‌లైన్ సలామ్ ఎయిర్ (SalamAir) భారతీయ ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్ చెప్పింది. అక్టోబర్ 1వ తారీఖు నుంచి భారత్‌కు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు సలామ్ ఎయిర్ అనేది భారత్‌లోని జైపూర్, లక్నో, కోజికోడ్, తిరువనంతపురం నగరాలకు సర్వీసులు నడిపింది. దీంతో ఒమాన్ వెళ్లే, అక్కడి నుంచి స్వదేశానికి వచ్చే వేలాది మంది భారతీయ ప్రవాసులకు (Indian Expatriates) తక్కువ బడ్జెట్‌లో ప్రయాణించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోతుంది. ఈ మేరకు ఇప్పటికే బుకింగ్స్ చేసుకున్న ప్రయాణికులకు సలామ్ ఎయిర్ ఇమెయిల్స్ పంపించింది. ఇక ఈ ఇమెయిల్స్ అందుకున్న వందలాది మంది ఇండియాకు వచ్చే, అక్కడికి వెళ్లే ప్రయాణీకుల ప్రయాణ ప్రణాళికలు గందరగోళంలో పడ్డాయనే చెప్పాలి.
"అక్టోబర్ 01, 2023 నుండి మేము మా విమాన సర్వీసులను ఇండియా నుంచి, ఆ దేశానికి వెళ్లే వాటిని నిలిపివేస్తున్నామని మీకు తెలియజేయడానికి చింతిస్తున్నాము. ఈ నిర్ణయం అంత తేలికగా తీసుకుంది కాదు. కానీ, భారతదేశానికి విమాన సర్వీసుల కేటాయింపు పరిమితి కారణంగా తీసుకోకతప్పడం లేదు. ఈ న్యూస్ మీకు అసౌకర్యానికి గురిచేస్తుందని మాకు తెలుసు. ఈ నిర్ణయం వల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మమ్మల్ని క్షమించండి" ఇది సలామ్ ఎయిర్ భారత ప్రయాణికులకు (Indian Passengers) చేసిన ఇమెయిల్ సారాంశం. ఇక ప్రీబుకింగ్స్ (Pre Bookings) చేసుకున్న ప్రయాణికుల కోసం ఈ సందర్భంగా కీలక ప్రకటన కూడా చేసింది. ఇప్పటికే భారత్‌లోని నాలుగు గమ్యస్థానాలకు రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులందరికీ పూర్తిగా టికెట్ ఛార్జీలు వాపస్ చేస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.