US Is Going to Hell: 'అమెరికాను చూసి ప్రపంచమంతా నవ్వుతోంది.. నాశనం అవుతోంది.. నరకానికి వెళ్తోంది'
ABN , First Publish Date - 2023-04-05T12:49:11+05:30 IST
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ (Donald Trump Arrest) కావడం, ఆ తర్వాత విడుదలై ఫ్లోరిడాలోని (Florida) తన నివాసం మార్ ఏ లాగోకి చేరుకుని తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు.
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ (Donald Trump Arrest) కావడం, ఆ తర్వాత విడుదలై ఫ్లోరిడాలోని (Florida) తన నివాసం మార్ ఏ లాగోకి చేరుకుని తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా తనపై మోపిన అభియోగాల్లో తాను దోషిని కాదని, తనపై మోపిన ఆరోపణలను తప్పుడుగా భావించి వాటిని కొట్టివేయాలని కోర్టు ముందు విన్నవించినట్లు ట్రంప్ తెలిపారు. "మన దేశం నాశనమవుతోంది.. నరకానికి వెళ్తోంది.. ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత ప్రపంచం మన దేశాన్ని చూసి నవ్వుకుంది. ఇది దేశానికే అవమానం. మనం మన దేశాన్ని రక్షించుకోవాలి. అమెరికాను నాశనం చేయాలనుకునేవారి నుంచి రక్షించేందుకు ప్రయత్నించడమే నేను చేసిన నేరమా?" అంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా చరిత్రలో అత్యంత చీకటి ఘడియలలో మనం జీవిస్తున్నామని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. కనీసం ఈ క్షణమైనా నేను గొప్ప ఉత్సాహంతో ఉన్నానని అన్నారు. అమెరికాలో (America) ఇలాంటివి జరుగుతాయని నేను ఎప్పుడూ అనుకోలేదని తనపై నేరారోపణల గురించి ట్రంప్ ప్రస్తావించారు. ఇది తప్పుడు కేసు. రాబోయే 2024 అధ్యక్ష ఎన్నికల్లో తనను పోటీ చేయకుండా నిలువరించేందుకే దీనిని తెరపైకి తెచ్చారని ట్రంప్ విమర్శించారు. నేను చేసిన నేరం ఏమిటంటే దేశాన్ని నాశనం చేయాలనుకునే వారి నుంచి రక్షించేందుకు ప్రయత్నించడమే అని ట్రంప్ దుయ్యబట్టారు. ఇది దేశానికి అవమానమని అన్నారు.