YSRCP : ఉండవల్లి శ్రీదేవి ఏ పార్టీలో చేరబోతున్నారు.. తాడికొండ నుంచి బరిలోకి దింపడానికి జగన్ ఎవరెవర్ని పరిశీలిస్తున్నారు.. వైఎస్ సన్నిహితుడికేనా..!?
ABN , First Publish Date - 2023-03-26T21:41:09+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎమ్మెల్యే కోటా ఎన్నికల ఫలితాలు, క్రాస్ ఓటింగ్, వైసీపీ సస్పెన్షన్ అయిన ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) , కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sirdhar Reddy)..
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎమ్మెల్యే కోటా ఎన్నికల ఫలితాలు, క్రాస్ ఓటింగ్, వైసీపీ సస్పెన్షన్ అయిన ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) , కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sirdhar Reddy), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy), ఉండవల్లి శ్రీదేవి (Vundavalli Sridevi) లపై అధిష్ఠానం సస్పెన్షన్ వేటు గురించే చర్చించుకుంటున్నారు. ఈ సస్పెన్షన్ వ్యవహారంపై ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ మీడియా ముందుకొచ్చి వైసీపీ అధిష్ఠానంపై దుమ్మెత్తిపోశారు. మరోవైపు.. ఆదివారం నాడు హైదరాబాద్ వేదికగా శ్రీదేవి మీడియా మీట్ నిర్వహించి అసలేం జరిగిందో అన్నీ వివరంగా చెప్పేశారామె. ఈ నలుగుర్నీ జగన్ తన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సరే.. ఈ నలుగురి స్థానంలో ముఖ్యంగా తాడికొండ నియోజకవర్గంలో (Tadikonda Assembly Constituency) ఎవర్ని బరిలోకి దింపుతారనేదానిపైనే ఇప్పుడు నియోజకవర్గంలో కార్యకర్తలు, వైసీపీ వీరాభిమానులు (YSRCP Fans) ఆలోచనలో పడ్డారట. అసలు తాము ఎవరి వెంట అడుగులేయాలి..? శ్రీదేవి ఏ పార్టీలో చేరబోతున్నారు..? అటు శ్రీదేవి వెంట నడవాలా..? లేకుంటే వైసీపీలోనే ఉండిపోవాలా అని ద్వితియశ్రేణి నేతలు, ఎమ్మెల్యే అనుచరులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారట. తాడికొండ వేదికగా అసలేం జరగబోతోందనే విషయాలపై ప్రత్యేక కథనం.
ఏం జరుగుతుందో..?
ఉమ్మడి గుంటూరు జిల్లాలో తాడికొండ నియోజకవర్గం చాలా కీలకమైనది. 2019 ఎన్నికలకు ముందు ఉండవల్లి శ్రీదేవిని స్వయంగా జగనే రాజకీయాల్లోకి ఆహ్వానించి వైసీపీ కండువా కప్పారు. అంతకుముందు వరకు హైదరాబాద్‌లో స్థిరపడి, వైద్యురాలుగా పని చేసిన ఆమె.. జగన్ ఆహ్వానంతో రాజకీయాల్లోకి వచ్చారు. అత్యంత కీలకం అయిన తాడికొండ నియోజకవర్గ నుంచి శ్రీదేవిని బరిలోకి దింపగా.. ఎవరూ ఊహించని రీతిలో విజయం సాధించారు. అమరావతి రాజధాని ప్రాంతం తాడికొండ పరిధిలోనికే వస్తుంది. అయితే అప్పటి వరకూ అధికారంలో ఉన్న టీడీపీని కాదని రాజధాని రైతులంతా వైసీపీకే పట్టం కట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. రాజధాని విషయంలో జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారో.. అసలు వైసీపీకి ఓటేయాలా వద్దా అనే ఆందోళన నుంచి ఆఖరికి ఆమెకే ఓటేసి గెలిపించి చట్టసభలకు పంపించారు నియోజకవర్గ ప్రజలు. సీన్ కట్ చేస్తే అమరావతి రైతులను (Amaravati Farmers) వైసీపీ నిలువెత్తినా మోసం చేసేసింది. అమరావతిని పూర్తిగా పక్కనపెట్టి.. మూడు రాజధానులను జగన్ తెరపైకి తెచ్చారు. దీంతో అమరావతి రైతులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నాటి నుంచి నేటి వరకూ రైతులంతా కలిసి.. రాజధాని అమరావతిలోనే కావాలని ధర్నాలు, నిరసనలు, ర్యాలీలతో హోరెత్తిస్తూనే ఉన్నారు. ఈ దెబ్బతో రానున్న ఎన్నికల్లో అసలు వైసీపీకి ఈ నియోజకవర్గంలో మనుగడే ఉండదని స్పష్టంగా అర్థమవుతోందంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఎఫెక్ట్ మొత్తం రానున్న ఎన్నికల్లో ఎవరు వైసీపీ నుంచి నిలబడినా కచ్చితంగా పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే వైసీపీ నుంచి వేటు పడిన తర్వాత శ్రీదేవి ఇంతవరకూ తాను ఏ పార్టీలో చేరాలనేదానిపై నిర్ణయం తీసుకోలేదని చెప్పినప్పటికీ టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే తాడికొండ నుంచి రానున్న ఎన్నికల్లో మళ్లీ మహిళనే బరిలోకి దింపాలనే యోచనలో జగన్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరో.. సీనియర్ నేత కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలియవచ్చింది.
ఇంతకీ ఆ ఇద్దరెవరు..!?
జగన్ పరిశీలనలో ఒకరు మహిళా నేత.. మరొకరు కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నేత ఉన్నట్లు ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. ఆ ఇద్దరిలో ఒకరు కత్తెర హెని క్రిస్టినా (Kattera Henry Christina) కాగా మరొకరు డొక్కా మాణిక్క వరప్రసాద్ (Dokka Manikya Varaprasad). వాస్తవానికి తాడికొండ నియోజకవర్గానికి వైసీపీకి మొదట్నుంచీ కష్టపడిన వ్యక్తి హెని క్రిస్టినా అని కార్యకర్తలు, అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తని తాడికొండ కార్యకర్తలు చెబుతుంటారు. ఇదిగో ఈమెకే పక్కాగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నారనే టైమ్‌కు ఆఖరి నిమిషంలో శ్రీదేవి రాజకీయాల్లోకి రావడం.. అనూహ్యంగా ఆమెకు టికెట్ ఇవ్వడంతో హెని క్రిస్టినా తీవ్ర నిరాశకు లోను కావాల్సివచ్చింది. శ్రీదేవికి టికెట్ ఇచ్చినప్పటికీ ఆమెను గెలిపించుకుని వచ్చారు హెస్టినా. అధికారంలోకి వచ్చాక మొదట్నుంచీ వైసీపీకి ఆమె చేసిన సేవలను గుర్తించిన సీఎం జగన్ కీలక పదవే కట్టబెట్టారు. హెస్టినాకు గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని జగన్ ఇచ్చారు. దీంతో ఆమెకు ప్రాధాన్యత దక్కినట్లయ్యింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఆమె పనిచేయడం, సొంత నియోజకవర్గం కూడా తాడికొండే కావడంతో ప్రజలతో మంచి సంబంధాలున్నాయి. అంతేకాదు.. జిల్లా పరిషత్ చైర్మస్ అయ్యాక జనాల్లో మరింత తిరుగుతుండటంతో నియోజకవర్గంపై మరింత పట్టు పెరిగిందట. ఇప్పుడు శ్రీదేవిని ఎలాగో పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఇక తనకే టికెట్ అని హెస్టినా ఆశలు పెంచుకున్నారట. జగన్ కచ్చితంగా తనకే టికెట్ ఇస్తారని ఆమె ఎదురు చూస్తున్నారట.
డొక్కా విషయానికొస్తే..
డొక్కా మాణిక్య వరప్రసాద్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి చెప్పేందుకు ఏమీ లేదు. ఆయన కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. తాడికొండ నియోజకవర్గం నుంచి 2004, 2009లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత మూడు నాలుగేళ్లు రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న ఆయన.. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu) సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. అయితే తాడికొండ నుంచి పోటీచేయాలని సర్వశక్తులా ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరికి డొక్కాను ప్రత్తిపాడు నుంచి బరిలోకి దింపారు. అయితే డొక్కాపై మేకతోటి సుచరిత (Mekathoti Sucharitha) 7,398 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే టీడీపీలో ఆయన చాలా రోజులు ఉండలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత వైఎస్ జగన్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. అప్పటి వరకూ తనకున్న ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేసి పార్టీలో చేరారాయన. ఆ తర్వాత జగన్ మరోసారి ఆయన్ను ఎమ్మెల్సీని చేసి శాసనమండలికి పంపారు.
ప్రస్తుతం తాడికొండ నియోజకవర్గం ఇంచార్జ్‌గా డొక్కా వ్యవహరిస్తున్నారు. తాడికొండ అంటే ఈయనకు మహాప్రీతి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగానే డొక్కాను తాడికొండకు ఇంచార్జ్‌గా (Tadikonda Incharge) నియమించారు. శ్రీదేవిపై నియోజకవర్గంలో రోజురోజుకూ వ్యతిరేకత పెరగడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. ముఖ్యంగా శ్రీదేవికి అనుకూలంగా, వ్యతిరేకంగా రెండు వర్గాలు చీలిపోవడం, అమరావతిపై గతంలో ఆమె చేసిన కామెంట్స్ ఇవన్నీ అధిష్ఠానానికి రుచించలేదు. దీంతోపాటు.. బాపట్ల ఎంపీ నందిగాం సురేష్‌తో కూడా ఈమెకు పడలేదు. ఇలా ఒకట్రెండు కాదు ఆఖరికి పేకాట శిబిరాలతో శ్రీదేవి పూర్తిగా వివాదాల్లో మునిగిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇవన్నీ నిశితంగా పరిశీలించిన అధిష్ఠానం డొక్కాను రంగంలోకి దింపింది. డొక్కాకు బాధ్యతలు కట్టబెట్టాక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నాటి నుంచే శ్రీదేవిలో ఆందోళన మొదలైందని కార్యకర్తలు చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఇండైరెక్టుగా రానున్న ఎన్నికల్లో డొక్కాకే టికెట్ ఇస్తారని ఇంచార్జ్‌గా బాధ్యతలు కట్టబెట్టిన రోజే ఫిక్స్ చేశారని ఆయన అభిమానులు, అనుచరులు చెప్పుకుంటూ ఉన్నారు.
మొత్తానికి చూస్తే.. అటు పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో ఉన్న హెని క్రిస్టినా, ఇటు వైఎస్‌కు అత్యంత సన్నిహితుడు, డొక్కా ఉన్నారు. అయితే ఎక్కువ శాతం డొక్కాకే టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందని గుంటూరు రాజకీయాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శ్రీదేవిని పార్టీ నుంచి సస్పెన్షన్‌కు ముందే అభ్యర్థిని ఫైనల్ చేసుకునే ఇలా చేశారని కూడా వార్తలు వచ్చాయని సమాచారం. ఫైనల్‌గా జగన్ ఎవరికి టికెట్ ఇస్తారో.. ఎవరికి హ్యాండిస్తారో తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకూ వేచి చూడాల్సిందే మరి.