YSRCP On Rajanikanth : అతిథిగా వస్తే తలైవాను టార్గెట్ చేయడమేంటి.. వైసీపీ ఇంత నీచానికి దిగజారాలా.. ఈ కామెంట్స్‌గానీ చూశారో..!?
ABN , First Publish Date - 2023-04-29T21:21:06+05:30 IST
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Super Star Rajanikanth).. ఇప్పుడీ పేరు ఏపీలో ఎక్కడ చూసినా మార్మోగిపోతోంది. ఏపీలో ఏ ఇద్దరు కలిసినా తలైవా గురించే చర్చించుకుంటున్నారు. ఇందుకు కారణం..
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Super Star Rajanikanth).. ఇప్పుడీ పేరు ఏపీలో ఎక్కడ చూసినా మార్మోగిపోతోంది. ఏపీలో ఏ ఇద్దరు కలిసినా తలైవా గురించే చర్చించుకుంటున్నారు. ఇందుకు కారణం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల (NTR 100 Years Celebrations) అంకురార్పణ సభకు తలైవా రావడమే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై.. ఎన్టీఆర్‌తో (Sr NTR) తనకున్న అనుబంధాన్ని చెబుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై (TDP Chief Chandrababu) ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాదు ఇంకో అడుగు ముందుకేసి ఎన్టీఆర్ యుగపురుషుడైతే.. చంద్రబాబు విజనరీ అని తలైవా కొనియాడారు. చంద్రబాబు రూపొందించిన విజన్-2047 ప్రణాళిక అమలైతే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్లిపోతుందని రజనీ చెప్పుకొచ్చారు. చంద్రబాబును ఇలా పొగిడారో లేదో నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు రెచ్చిపోయారు. ఇంతకీ ట్రోల్ చేసే అంతలా రజనీ ఏం మాట్లాడారు..? ఎందుకింతలా వైసీపీ రెచ్చిపోయి.. వైఛీపీగా ప్రవర్తిస్తోంది..? వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతున్నారు..? టీడీపీ ఇచ్చిన కౌంటర్లేంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఇంత ఘోరమా..?
ఏపీలో రాజకీయ విమర్శలకు హద్దులు దాటిపోయాయి. మీడియా ముందుకొస్తే చాలు నేతలు ఊగిపోతూ మాట్లాడే మితిమీరిన మాటలు రచ్చకు దారితీస్తున్నాయి. విమర్శలు అంటే ఒకప్పుడు ఎంత పద్ధతిగా ఉండేవో.. ఇప్పుడు కొందరు నేతలు.. ముఖ్యంగా అధికార వైసీపీ నేతల మాటలు అత్యంత హీనంగా ఉన్నాయనేది జగమెరిగిన సత్యమే. ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నుంచి ఎవరైనా మీడియా ముందుకొస్తే చాలు.. నిమిషాల్లో ప్రెస్‌మీట్లు పెట్టేసే బ్యాచ్ వైసీపీలో కొందరున్నారు. ఇక వారి నోట బూతులు తప్ప మరొకటి రావని పలు సందర్భాల్లో అందరూ చూసే ఉంటారు. ఆ బ్యాచ్ ఎవరనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా చంద్రబాబు మాట్లాడినా.. బాబు గురించి ఎవరైనా మాట్లాడినా ఇక వైసీపీ నేతలు ఇంకో పనే లేదన్నట్లుగా అదే పనిగా ప్రెస్‌మీట్లు పెట్టి తెగ హడావుడి చేస్తుంటారు.
- ఇక శుక్రవారం నాడు జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల వేదికగా తలైవా చేసింది ఒకే ఒక్క ప్రకటనే.. వైసీపీ నుంచి అటు నేతలు, ఇటు కార్యకర్తలు మాత్రం వందల్లో కౌంటర్లు ఇస్తున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని, మంత్రి రోజా ఇంకా చాలా మంది ముఖ్య నేతలు మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. మీడియా ముందుకొస్తే బూతులు మాట్లాడతారనే పేరున్న కొడాలి నాని.. రజనీకాంత్‌ను వ్యక్తిగతంగా విమర్శించి తన పరువు తానే తీసుకున్నారనే విమర్శలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయ్. మూడు రోజులు షూటింగ్ చేస్తే నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉండే రజనీకాంత్, తెలుగు ప్రజలకు ఏం చెబుతారు..? అని నాని మాట్లాడిన మాటలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. విమర్శలకు ఒక హద్దు అనేది ఉంటుంది కానీ.. ఇలా వ్యక్తిగతంగా, ఆరోగ్యంగా మాట్లాడటమేంటి..? అతిథిగా అది కూడా నాని సొంత జిల్లాకు వచ్చిన తలైవాను ఇలానే మాట్లాడేది..? అవతలి వ్యక్తులు ఎవరైనా సరే గౌరవించడం.. కనీసం ఆయన వయస్సుకు కూడా గౌరవం ఇవ్వకుండా పచ్చిగా మాట్లాడటం ఎంతవరకు సబబు..? ఇదేనా రాజకీయం అంటే..? ఇంత ఘోరంగా తిట్టకుంటే నిద్ర రాదా ఏంటి..? విమర్శలకు హద్దులుంటే బాగుంటుందని సొంత పార్టీ నేతలే సూచిస్తున్న పరిస్థితి నెలకొందంటే నానిలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.
- ఇక వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానుల విషయానికొస్తే.. ఈ కామెంట్స్, మీమ్స్, సెటైర్లు చూస్తే బాబోయ్ తలైవా ఏపీకి రావడమే తప్పు.. అసలెందుకు వచ్చానో అని తలైవా అనుకుంటారేమో. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతిన్ని చేయడంలో రజనీకాంత్ కూడా ఉన్నారనేది వైసీపీ సోషల్ మీడియా వాదన. నాడు ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ఉండి.. ఇప్పుడు అదే ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడిది అని వైసీపీ సోషల్ మీడియా ప్రశ్నిస్తోంది. ట్విట్టర్ వేదికగా నాడు చంద్రబాబు పక్కన, రజనీ కూర్చుని ఉన్న వీడియోలను సైతం పోస్టు చేశారు. సొంత రాష్ట్రంలో.. సొంత కుటుంబంలో ఉండే సమస్యలను వెలగపెట్టని మహానుభావులు అందరూ వచ్చి ఇక్కడ ఏం చేయలేని వారికి కలరింగ్ ఇవ్వడం ఏదైతో ఉందో.. దేనితో నవ్వాలో కూడా అర్ధం కావట్లేదని కొందరు వైసీపీ కార్యకర్తలు ట్వీట్లు చేస్తూ.. దాన్ని సూపర్‌స్టార్‌కు ట్యాగ్ చేశారు. ఇంకొందరైతే.. 2024లో జగన్‌ను ఢీకొట్టాలంటే లోకేష్ వల్ల, పవన్ కల్యాణ్ వల్ల కాదని అర్థమై పాపం రజనీని రంగంలోకి దింపారనే కామెంట్స్ చేస్తున్నారు. జగన్ వీరాభిమానులు కొందరు.. చంద్రబాబు హీరోలు, మీడియాను నమ్మితే.. వైఎస్ జగన్ ప్రజలను మాత్రమే నమ్ముతారని తెగ హడావుడి చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు, సోషల్ మీడియాలో కౌంటర్లకు చాచి కొట్టినట్లుగా టీడీపీ నేతలు, సోషల్ మీడియా కూడా రియాక్ట్ అవుతోంది.
వాస్తవానికి వివాదాలు అంటే ఆమడ దూరంలో రజనీ ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీకి వచ్చి ఇలా అడ్డంగా బుక్కయ్యారనేవాళ్లు లేకపోలేదు. ఆయన చంద్రబాబు గురించి మాట్లాడినంత మాత్రాన.. ఏపీకి వచ్చిన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా..? పోనీ ఇన్ని మాటలు అన్న వైసీపీ.. వేరే రాష్ట్రం నుంచి ఎవరినైనా ప్రభుత్వ కార్యక్రమాలకు తెచ్చుకుంటే.. ఇలానే టీడీపీనో.. జనసేననో విమర్శిస్తే ఎలా ఉంటుందనే విషయం గ్రహించి మెలిగితే మంచిదేమో. పోనీ ఇన్ని ట్రోల్స్ చూసిన తర్వాత కూడా వేరొకరు ఏపీకి రావడానికి సాహసిస్తారా..? ఏదైనా పార్టీలు పరంగా చూసుకోవాలే కానీ.. వ్యక్తిగతంగా, అతిథిగా వచ్చిన వారిని ఇన్నేసి మాటలు అనడం ఎంత దారుణం. ఇవన్నీ తెలిసి కూడా తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్న వైఎస్ జగన్ ఎందుకు స్పందించట్లేదని టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.