Power Cuts in AP: జగన్ పాలనలో ఉక్కపోత.. వర్షాకాలంలో ఎడాపెడా కరెంట్ కోతలు

ABN , First Publish Date - 2023-09-05T19:19:13+05:30 IST

ఏపీలో జగన్ పాలనలో విద్యుత్ ఛార్జీలతో పాటు కరెంట్ కోతలు కూడా పెరిగిపోయాయి. వర్షాకాలంలో అప్రకటిత కరెంట్ కోతలు విధిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల ప్రజలు సబ్‌స్టేషన్‌లను ముట్టడిస్తూ తమ నిరసన తెలియజేస్తున్నారు.

Power Cuts in AP: జగన్ పాలనలో ఉక్కపోత.. వర్షాకాలంలో ఎడాపెడా కరెంట్ కోతలు

జగన్ పాలనలో అప్రకటిత విద్యుత్ కోతలతో ఏపీ ప్రజలు అల్లాడిపోతున్నారు. లోడ్ రిలీఫ్ పేరుతో విధిస్తున్న కోతలతో ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. పట్నాలు, పల్లెలు అనే తేడా లేకుండా రోజుకు కనీసం మూడు గంటల పాటు కరెంట్ కోతలు ఉంటున్నాయని.. ముఖ్యంగా రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారని ఏపీ ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు పరిశ్రమలు కూడా కరెంట్ కోతలను తట్టుకోలేక పవర్ హాలీడే ప్రకటిస్తున్నాయి. దీంతో వర్షాకాలంలో కరెంట్ కోతలు ఏంటని ప్రశ్నిస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకున్న పాపాన కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రాత్రిపూట ప్రభుత్వం విధిస్తున్న కరెంట్ కోతల కారణంగా తమకు నిద్ర ఉండటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా వేసవి కాలంలో విద్యుత్ కోతలు విధించడం వంటి పరిస్థితులు కనిపిస్తాయి. అయితే వర్షాకాలంలో ఏపీలో కరెంట్ కోతలకు రెండు కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. పవన విద్యుత్ ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోవడం, రిజర్వాయర్లలో నీరు లేకపోవడంతో జల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలగడం వంటి అంశాలు కరెంట్ కోతలకు అనివార్యంగా మారినట్లు అధికారులు చెప్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ దొరకడం లేదని.. అందుకే విద్యుత్ సరఫరాకు ఆటంకం తప్పడం లేదని అధికారులు వాపోతున్నారు. ఒకవైపు విద్యుత్ ఛార్జీలను పెంచినా కోతలు విధించడం సరికాదని జగన్ సర్కారుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


అటు ఏపీలో కరెంట్ కోతలపై టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రజనీకాంత్ జైలర్ మూవీలోని డైలాగ్‌తో చంద్రబాబు సెటైర్లు వేశారు. కరెంట్ కోతలు లేని చోటు లేదు.. కరెంట్ బిల్లులపై తిట్టని నోరు లేదు... ఈ రెండు జరగని ఊరే లేదు.. అర్థమైందా సైకో జగన్ రెడ్డీ అంటూ ఓ సమావేశంలో చంద్రబాబు ఎద్దేవా చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ఓ పెద్ద కటింగ్ మాస్టర్ అని సెటైర్ వేశారు. జగన్‌లో విషయం లేదని.. అందుకే ఏపీలో పవర్ లేదని ఎద్దేవా చేశారు. ఒకవైపు ఛార్జీల బాదుడు.. మరోవైపు కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.


వాస్తవానికి రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విద్యుత్ కొరత ఉండేది. అయితే చంద్రబాబు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు జరిపి 24 గంటల విద్యుత్ ఇచ్చింది. టీడీపీ హయాంలో విద్యుత్ విషయంలో పూర్తి స్థాయిలో స్వయం సమృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీ మిగిలింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ఈగో సమస్యలతో విద్యుత్ రంగాన్ని పట్టించుకోలేదు. దీంతో విద్యుత్ మిగులు రాష్ట్రం కాస్త కరెంట్ కోతల రాష్ట్రంగా మారిపోయింది. తెలంగాణ మంత్రులు కూడా పలు సందర్భాల్లో ఏపీలో కరెంట్ కోతల గురించి విమర్శించారు. కానీ వాటిని జగన్ ఒకచెవితో విని మరో చెవితో వదిలేసింది. దీంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. ఇటీవల ప్రకాశం జిల్లా తుమ్మలచెరువులో ప్రజలు కరెంట్ కోతలను తట్టుకోలేక విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. సాయంత్రం 5 గంటలకు పోయిన కరెంట్ అర్ధరాత్రి వేళల్లో కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. దాదాపు రాష్ట్రంలో పలుచోట్ల ఇదే సమస్య ఉందని ప్రజలు వివరిస్తున్నారు. కరెంట్ కోతల కారణంగా జగన్ చేతకాని పాలనకు ఏపీ నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోందని సోషల్ మీడియాలో నెటిజన్‌లు విమర్శిస్తున్నారు.

Updated Date - 2023-09-05T19:24:36+05:30 IST