AP Politics : ప్చ్.. వైఎస్ జగన్‌లో మునుపటి కళ ఏమైందో.. ఈ పరిణామాలే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా.. మళ్లీ ఆ రోజులు ఎప్పుడొస్తాయో..!?
ABN , First Publish Date - 2023-04-14T17:57:40+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా నెలకొన్న పరిణామాలతో సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) ఉక్కిరిబిక్కిరవుతున్నారా..? కనీసం ప్రశాంతంగా ఊపిరిపీల్చుకునే పరిస్థితి ..
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా నెలకొన్న పరిణామాలతో సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) ఉక్కిరిబిక్కిరవుతున్నారా..? కనీసం ప్రశాంతంగా ఊపిరిపీల్చుకునే పరిస్థితి కూడా జగన్‌కు (YS Jagan) లేకుండా పోయిందా..? ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ (Telugudesam).. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీలు (BRS) ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా..? వీటన్నింటితో సీఎంలో మునుపటి కల కూడా లేకుండా పోయిందా..? అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉక్కిరి బిక్కిరయ్యేంతలా టీడీపీ, బీఆర్ఎస్ ఏం చేస్తున్నాయ్..? జగన్ ఈ మధ్య ఎందుకంత యాక్టివ్‌గా కనిపించట్లేదు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ప్రత్యేక కథనం..
అసలేం జరుగుతోంది..!?
తెలుగు రాష్ట్రాల్లోనే (Telugu States) కాదు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఇప్పుడు ఎక్కడ చూసినా ఏపీ గురించే చర్చ. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కుగా ఉన్న వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ( Vizag Steel Plant) ప్రైవేటీకరణ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం.. ఈ మధ్య ఏకంగా బిడ్‌లకు కూడా ఆహ్వానించడంతో ఒక్కపరిస్థితులు మారిపోయాయి. ప్రైవేటీకరణను ఆపుతామని బిడ్ వేసి స్టీల్‌ప్లాంట్ దక్కించుకోవాలని కేసీఆర్ సర్కార్ (KCR Govt) రంగంలోకి దిగింది. దీనికి ముందే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య పెద్ద ఎత్తునే మాటల తూటాలు పేలాయి. ఎంతలా అంటే తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేంతలా.. అంతకుమించి వ్యక్తిగతంగా విమర్శలు చేసుకునేదాకా పరిస్థితులు వెళ్లాయి. దీంతో అప్పటి వరకూ కలిసి మెలిసున్నాయనకున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కాస్త ఉప్పు-నిప్పులా మారిపోయాయి. ఉత్తరాంధ్ర మంత్రి సీదిరి అప్పలరాజు (Minister Seediri Appala Raju) అయితే సీఎం కేసీఆర్‌ను ఆయన కుటుంబాన్ని తీవ్ర స్థాయిలోనే తిట్టిపోశారు. ఈ వ్యాఖ్యలు ఏపీ-తెలంగాణ మధ్య ప్రాంతీయ విబేధాలు రెచ్చగొట్టే పరిస్థితికి వెళ్లాయి. మంత్రులు చేసిన ఈ కామెంట్స్‌తో అసలు ఏ ముఖం పెట్టుకుని మళ్లీ కేసీఆర్‌తో మాట్లాడాలని వైఎస్ జగన్ తెగ ఫీలవుతున్నారట. అందుకే ఎన్ని సభలు, సమావేశాలు జరిగినా.. కనీసం ప్రభుత్వం తరఫున ప్రకటన రూపంలో అయినా జగన్ నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావనే రాలేదట. కేసీఆర్ సర్కార్ బిడ్ వేస్తామని ప్రకటించడం, ఇటు ఏపీ మంత్రులు చేసిన కామెంట్స్‌తో ఏం చేయాలో దిక్కుతోచక ఇబ్బంది పడుతున్నారట. అసలు అధికారికంగా కూడా ఏదైనా చిన్న ప్రకటన అయినా చేయాలన్నా ఆ పరిస్థితి లేకపోయిందట. దీంతో చేసేదేమీ లేక సీదిరికి ఫోన్ చేసి సీఎంవో బాగానే తలంటింది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌గా గంటకొక ప్రకటన చేయడంతో ఒకదాని తర్వాత మరొకటి జగన్‌కు తలనొప్పిగా మారాయట.
ఇక టీడీపీ విషయానికొస్తే..
అసలే యువనేత లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో (Lokesh Yuvagalam Padayatra) ప్రభుత్వం తప్పులను ఎండగడుతుండటం, మరోవైపు అటు లోకేష్, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు సెల్ఫీలతో ఛాలెంజ్ చేస్తూ వస్తున్నారు. లోకేష్ ఎక్కడ పాదయాత్ర చేసినా స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలు సభల్లో చెబుతూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇప్పుడు చంద్రబాబు (Chandrababu) జిల్లాల పర్యటన చేస్తూ ఎక్కడికక్కడ సీఎం జగన్, మంత్రుల తీరును ఎత్తిచూపిస్తూ వస్తున్నారు. ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తుండటంతో గ్రౌండ్ లెవల్‌లో అసలేం జరుగుతోందని సీఎం ఆలోచనలో పడ్డారట.
కనిపించని కళ!
వైఎస్ జగన్ ఎక్కడ బహిరంగ సభలకు వెళ్లినా.. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రారంభానికి వెళ్లినా చిరునవ్వుతో సభకు వచ్చిన ప్రజలు, కార్యకర్తలను పలకరిస్తూ ఉంటారు. ఆ నవ్వు, ప్రతిపక్షాలపై సెటైర్లు, కౌంటర్లు గట్టిగా ఇచ్చేవారని కార్యకర్తలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్య జరిగిన సమావేశాల్లో జగన్ ముఖం కళ చెదిరినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు.. ప్రతిపక్ష పార్టీలకు కౌంటర్లిచ్చినట్లుగా కూడా పెద్దగా ఎక్కడా కనిపించలేదు. దీనికి కారణం అటు టీడీపీ.. ఇటు బీఆర్ఎస్ అని సొంత పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటూ.. ఈ రెండు పార్టీలకు సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అవన్నీ రివర్స్ అటాక్‌లే అవుతున్నాయి. తప్పులు ఎత్తిచూపితే ఇలా నోరు పారేసుకుంటారేంటి..? అని బీఆర్ఎస్, టీడీపీ నేతలు, కార్యకర్తలు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు.
మొత్తానికి చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తాజా పరిణామాలు జగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. దీంతోపాటు నిన్న మొన్నటి వరకూ ఎంతో స్నేహంగా ఉన్న కేసీఆర్‌తో కూడా ఆ బంధం ముగిసినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆచి తూచి మాట్లాడి కౌంటర్లు ఇవ్వాల్సిన మంత్రులు కూడా ఇష్టారీతిన నోరు పారేసుకోవడంతో అసలుకే ఎసరు వచ్చి పడిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయ్. ఇవన్నీ చాలవన్నట్లుగా మధ్యలో బాబాయ్ హత్యకేసు, అమరావతి వ్యవహారం.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తుండటంతో జగన్ ఊపిరిపీల్చుకోలేని పరిస్థితిలో ఉండిపోయారట. మళ్లీ మునుపటి జగన్‌ను.. జగన్ ముఖంలోని ఆ కలను వైసీపీ కార్యకర్తలు, వీరాభిమానులు ఎప్పుడు చూస్తారో ఏంటో మరి.