Sukesh Vs Kavitha : కవితపై మరో సంచలన లేఖ రిలీజ్ చేసిన సుకేష్.. ఈసారి మొత్తం అన్నీ...
ABN , First Publish Date - 2023-04-15T16:21:14+05:30 IST
మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) మధ్య...
మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) మధ్య లేఖల యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఇప్పటికే సుకేష్ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు రిలీజ్ చేయడం.. ఇందుకు కౌంటర్‌గా అసలు సుకేష్ అంటే ఎవరు..? అని కవిత ప్రశ్నించడం పెద్ద సంచలనమే అయ్యింది. అయితే తాజాగా కవితకు సంబంధించి 5 పేజీల లేఖను సుకేష్ రిలీజ్ చేశాడు. ఈసారి కవితపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఈ లేఖలో కవిత ప్రస్తావించిన విషయాలకు సమాధానం చెప్పడంతో పాటు.. ఆమె ఫోన్ నంబర్‌తో సహా స్క్రీన్ షాట్లు రిలీజ్ చేశాడు. అంతేకాదు.. దమ్ముంటే విచారణను ధైర్యంగా ఎదుర్కోండి అంటూ కవితకు ఛాలెంజ్ కూడా చేశాడు. ఇంతకీ కవిత గురించి సుకేష్ ఇంకా ఏమేం చెప్పాడు..? కేజ్రీవాల్ ప్రస్తావన ఎందుకొచ్చిందనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
కవితకు దమ్ముంటే..!
‘కవితక్క దమ్ముంటే విచారణను ధైర్యంగా ఎదుర్కోండి. కవిత నాకు బాగా తెలుసు. సుకేష్‌కు తెలుగు ఎలా తెలుసని TRS/BRS నాయకులు చెబుతున్నారు? నాకు తెలిసిన అన్ని భాషలే కాకుండా నా మాతృభాష తెలుగు, తమిళం అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. నా చిన్నప్పటి నుంచి ఇంట్లో మా తల్లిదండ్రులు తెలుగు, తమిళంలో మాట్లాడతారు.. అది నా మాతృభాష. టీఆర్‌ఎస్ నాయకులు ప్రధాన సమస్య నుంచి దారి మళ్లించడానికి మాత్రమే ఈ సిల్లీ విషయాలు మాట్లాడుతున్నారు. జైలు నుంచి సుకేష్ ఈ చాట్‌లను ఎలా యాక్సెస్ చేయగలడనే ప్రశ్న?. నేను చాలా స్పష్టంగా తెలియజేస్తాను. ఫోటోలు వీడియోలు నా బృందం ఆధీనంలో ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల అభ్యర్థన ఆధారంగా, బయట ఉన్న నా బృందం అన్ని ఆధారాలను అందజేస్తుంది. ఎల్లప్పుడూ కవితను నా అక్కగా గౌరవిస్తాను. ధైర్యం ఉంటే సరైన రీతిలో, సక్రమంగా విచారణ జరిగేలా సహకరించాలి. కవితను కవితక్క అని సంబోధించాను, ఆమె నా పెద్ద అక్కగా భావించాను. కానీ, దేశం, ప్రజాప్రయోజనాల రీత్యా సత్యం మాట్లాడుతున్నాను. కవితక్క నేను ఎవరో తెలియదని చెప్పారు.. కానీ కవితక్క అలా చెబుతారని అనుకోలేదు. కవిత అంటే నాకు గౌరవం.. అందుకే నేను ఆమె పేరును కవితక్క అని సేవ్ చేసుకున్నా. కవితక్కకు చెందిన రెండు ఫోన్ నెంబర్లు 91- 6209999999, 91-8985699999 నా ఫోన్‌లో కవితక్క అని సేవ్ చేసుకున్నా’ అని సుకేష్ లేఖలో రాసుకొచ్చాడు.
కేజ్రీవాల్ తర్వాత మీరే..!
‘నన్ను దొంగ, ఆర్థిక నేరగాడు అంటూ విమర్శించారు. మీరు కూడా అందులో భాగస్వాములే. దమ్ముంటే నాతో చాట్ సంభాషణలపై సీఐడీ, ఈడీతో విచారణ జరిపించాలి. కోర్టు ధుృవీకరణ ఎవిడెన్స్ చట్టం 65-బి కింద స్క్రీన్ షాట్స్‌ను విడుదల చేశాను. కవితకు రూ. 15 కోట్ల డెలివరీ తర్వాత ఫేస్‌టైమ్‌లో కేజ్రీవాల్, సత్యేంద్రజైన్‌తో మాట్లాడిన స్క్రీన్ షాట్స్‌ను కూడా విడుదల చేస్తాను. త్వరలోనే కేజ్రీవాల్‌తో చేసిన చాట్‌ను విడుదల చేస్తాను. మొత్తం 703 చాట్స్ ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు కేవలం 2 చాట్లు మాత్రమే బయటపెట్టాను. ఇంకా అనేక వీడియో చాట్లు, ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయి. కేజ్రీవాల్ తర్వాత నీవంతే (కవిత). తీహార్ క్లబ్‌కు కవితక్కను కేజ్రీవాల్‌ను స్వాగతిస్తున్నాను. నన్ను రాజకీయంగా ప్రభావితం చేస్తున్నారన్న విమర్శలు అర్ధరహితం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తాను. నేను నిర్దోషిగా బయటపడాలని అనుకుంటున్నాను. నా గుండెల్లో ఉన్న భారాన్ని దించుకోవాలని భావిస్తున్నాను. మీరు కూడా సీబీఐ, ఈడీ విచారణకు సహకరించాలి’ అని సుకేష్ ఛాలెంజ్ చేశాడు.
రేపే విచారణ..!
కాగా.. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే ఆప్ నేత సిసోడియా, విజయ్ నాయర్ సహా పలువురు జైల్లో ఉన్న నేపథ్యంలో కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల కమిషన్ జాతీయ హోదా కల్పించిన అనంతరం ఇక పార్టీ నేతలంతా జైలుకు వెళ్లేందుకు సిద్దంగా ఉండాలని కేజ్రీవాల్ పేర్కొనడం గమనార్హం. ఆయన అలా వ్యాఖ్యానించిన రెండ్రోజులకే మద్యం కుంభకోణం కేసులో సీబీఐ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే సుకేష్ మాత్రం కేజ్రీవాల్‌ను కచ్చితంగా అరెస్ట్ చేస్తారని.. అందుకే ఆయన తీహార్ జైలుకు స్వాగతిస్తున్నట్లుగా లేఖలో ఉంది. కేజ్రీవాల్ తర్వాత కవితను కూడా అరెస్ట్ చేస్తారని సుకేష్ జోస్యం చెబుతున్నాడు. ఫైనల్‌గా ఏమేం పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే మరి.