Bhupalpalli: BRSలో వర్గపోరు..ఎమ్మెల్యే గండ్ర వర్సెస్ ఎమ్మెల్సీ..
ABN , First Publish Date - 2023-02-25T13:18:00+05:30 IST
జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్‌లో వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. అభివృద్ధి కార్యక్రమాల కోసం మంత్రి కేటీఆర్.. భూపాలపల్లి
కేటీఆర్ సమక్షంలోనే ఆ జిల్లా బీఆర్ఎస్‌లో వర్గ విభేదాలు బట్టబయలయ్యాయి. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య వర్గపోరుతో బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారింది. సరైన గౌరవం దక్కడం లేదని ఆరోపిస్తూ.. ఓ వర్గం.. కేటీఆర్ ఎదుటే నినాదాలు చేయడం కలకలం రేపింది. అయితే.. కేటీఆర్.. ఎమ్మెల్సీ వర్గానికి చురకలు అంటిస్తూ.. ఎమ్మెల్యేకి పాజిటివ్‌గా మాట్లాడడం మరింత మంట పెట్టింది. ఇక తగ్గేదేలేదంటూ.. తాడోపేడో తేల్చుకోవాలని ఓ వర్గం నిర్ణయించుకుంది. అదే సమయంలో.. ఓ ఎమ్మెల్యే కొడుకు అత్యుత్సాహం హాట్‌టాపిక్‌గా మారుతోంది. కొడుకుతోనే తండ్రికి సన్‌స్ట్రోక్ తప్పదా అన్న చర్చ సాగుతోంది. ఇంతకీ.. ఏంటా జిల్లా?.. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గాల పోరుకు కారణాలేంటి?.. సన్ స్ట్రోక్ పొంచి ఉన్న ఆ ఎమ్మెల్యే ఎవరు?.. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..
పోలీసులతో మధుసూధనాచారి వర్గీయుల వాగ్వాదం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్‌లో వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. అభివృద్ధి కార్యక్రమాల కోసం మంత్రి కేటీఆర్.. భూపాలపల్లి జిల్లాకు వెళ్లగా.. ఆయన ముందే కొందరు నేతలు వర్గపోరుకు తెరలేపారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూధనాచారి వర్గీయులు.. ఎవరికివారు పరస్పరం నినాదాలు చేయడం కేటీఆర్ సభలో కలకలం రేపింది. కేటీఆర్‌కు హెలీప్యాడ్‌లో స్వాగతం పలికేందుకు మధుసూధనాచారి వర్గీయులు వెళ్లగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో.. మధుసూధనాచారి వర్గీయులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కేవలం గండ్ర వర్గీయులకే ప్రాధాన్యత ఇస్తూ.. తమకు ఇవ్వడం లేదని ఆరోపించారు.
భూపాలపల్లి టికెట్ చారీకే ఇవ్వాలని స్లోగన్స్
కేటీఆర్ సభలో గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతుండగా.. మధుసూధనాచారి వర్గీయులు జై సిరికొండ అంటూ నినాదాలు చేశారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పదుల సంఖ్యలో.. లేచి నిలబడి మరీ.. కేటీఆర్‌కు కనిపించేలా, వినిపించేలా నినాదాలు చేశారు. మధుసూధనాచారికి పార్టీలో అన్యాయం జరుగుతోందని.. వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి టికెట్ ఆయనకే ఇవ్వాలని స్లోగన్స్ ఇచ్చారు. దాంతో.. సభలో గందరగోళం నెలకొంది. ఆపై మాట్లాడిన కేటీఆర్.. మధుసూధానాచారి వర్గీయులకు చురకలు అంటించారు. మధుసూధనాచారిని మీరు ఓడిస్తే.. కేటీఆర్ అక్కున చేర్చుకుని ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారని.. మరో ఐదేళ్లపాటు ఆయనకు ఆ పదవి ఉంటుందని స్పష్టం చేశారు. అంటే.. వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి టికెట్.. సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికే అని కేటీఆర్ చెప్పకనే చెప్పారు. దాంతో.. మధుసూధనాచారి వర్గీయులు ఆలోచనలో పడ్డారు. మరోసారి పార్టీ నేతలతో చర్చించి.. తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది.
టికెట్ నాకే.. గెలిచేదీ నేనే అని చెప్పుకోవడం
వాస్తవానికి.. మధుసూధనాచారి.. బీఆర్ఎస్‌లో సీనియర్ లీడర్. ఉద్యమకాలం నుంచి నేటి వరకూ పార్టీ కోసం పనిచేస్తూ.. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికై.. తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. అయితే.. రెండోసారి మాత్రం.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో గండ్ర బీఆర్ఎస్‌లో చేరారు. ఆయన బీఆర్ఎస్‌లో చేరినప్పటినుంచి చారి సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత కేసీఆర్.. ఆయన్ను గుర్తించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి టికెట్‌పై మధుసూధనాచారి కన్నేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. దానిలో భాగంగానే.. కొంతకాలంగా ఆయన యాక్టివ్ పాలిటిక్స్ నిర్వహిస్తున్నారు. అయితే.. గండ్ర కూడా.. మధుసూధనాచారికి చెక్ పెడుతూ వస్తున్నారు. వేదిక దొరికినప్పుడల్లా.. రాబోయే ఎన్నికల్లో టికెట్ తనకే.. గెలిచేదీ తానే అని చెప్పుకుంటున్నారు.
నియోజకవర్గంలో ఇద్దరు కుమారుల అత్యుత్సాహం
ఇదిలావుంటే... కేసీఆర్.. చారి సాబ్‌కు సన్నిహితుడిగా ఉంటే.. గండ్ర వెంకటరమణారెడ్డి కేటీఆర్‌కు దగ్గర వ్యక్తిగా ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లే.. ఇటీవల బహిరంగ సభలో కేటీఆర్ కూడా గండ్రకు అనుకూలంగా మాట్లాడటంతో చారి సాబ్ వర్గీయులు ఖంగుతిన్నారు. మరో అడుగు ముందుకేసి.. తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అదేసమయంలో.. గతంలో మధుసూధనాచారి స్పీకర్‌గా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఆయన ఇద్దరు కుమారులు అత్యుత్సాహం ప్రదర్శించి.. కేడర్‌కు దూరమయ్యారన్న ప్రచారం ఉంది. వారిద్దరి మితిమీరిన చేష్టలే.. చారి ఓటమికి కారణం అయ్యాయన్న విశ్లేషణలు అప్పట్లో జోరుగా వినిపించాయి. దాంతో.. 2018 ఎన్నికల్లో చారి ఓటమికి సన్ స్ట్రోకే కారణమన్న చర్చ కూడా సాగింది. ఇప్పుడు.. సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి అదే సీన్ ఎదురవుతోంది. ఆయన కుమారుడు గౌతమ్‌రెడ్డి కూడా పార్టీ కేడర్‌ను దూరం చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.
సెటిల్‌మెంట్లు, వివాదాల్లో తలదూరుస్తూ అత్యుత్సాహం
ప్రతీ విషయంలో ఎమ్మెల్యే పుత్రుడిగా గౌతమ్‌రెడ్డి ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువవుతోందన్న టాక్ భూపాలపల్లి నియోజకవర్గంలో చక్కర్లు కొడుతోంది. సెటిల్‌మెంట్లు, వివాదాల్లో తలదూరుస్తూ అత్యుత్సాహం ప్రదర్శించడాన్ని గులాబీ కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. మొన్నటి కేటీఆర్ పర్యటనలో గౌతమ్‌రెడ్డి హడావుడే ఎక్కువగా కనిపించింది. నెంబర్ ప్లేట్ లేని బ్లాక్ కార్‌లో తిరుగుతూ ఆయన చేసిన హడావుడి అంతాఇంతా కాదని చెప్పొచ్చు. కేటీఆర్ దృష్టిని ఆకట్టుకునేందుకు గౌతంరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారన్న ఆరోపణలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అలాగే ఉంటే.. చారీ సాబ్‌కు సన్ స్ట్రోక్ తగిలినట్టే.. వచ్చే ఎన్నికల్లో గండ్ర వెంకటరమణారెడ్డి కూడా ఎఫెక్ట్ తప్పదని పార్టీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి.
మొత్తంగా.. భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్‌లో వర్గపోరు ఏమాత్రం సద్దుమణిగేలా కనిపించడంలేదు. ఇద్దరు నేతలకు.. ఇద్దరు పెద్దల ఆశీస్సులు ఉండడంతో.. ఎవరికివారే టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. అయితే.. సొంత ఇలాకాలో.. కేటీఆర్ ఇచ్చిన ఇండికేషన్స్‌తో.. మధుసూధనాచారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.