TS BJP : తెలంగాణపై బీజేపీ దూకుడు.. పెద్ద ప్లాన్‌తోనే కమలనాథులు వచ్చేస్తున్నారుగా.. ముహూర్తం ఫిక్స్..!
ABN , First Publish Date - 2023-07-11T23:00:56+05:30 IST
తెలంగాణలో ఎన్నికలు (TS Elections) సమీపిస్తుండటంతో బీజేపీ (BJP) దూకుడు పెంచింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల (Karnataka Election Results) తర్వాత డీలా పడటం, రాష్ట్ర అధ్యక్షుడి మార్పు, పార్టీలో పదవులు ఇవ్వట్లేదని అసంతృప్తులు ఎక్కువ కావడం, నేతలు పార్టీకి గుడ్ బై చెబుతుండటం ఇలా వరుస పరిణామాల నేపథ్యంలో.. బూస్ట్ ఇచ్చేందుకు అగ్రనాయకత్వం రంగం సిద్ధం చేసింది...
తెలంగాణలో ఎన్నికలు (TS Elections) సమీపిస్తుండటంతో బీజేపీ (BJP) దూకుడు పెంచింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల (Karnataka Election Results) తర్వాత డీలా పడటం, రాష్ట్ర అధ్యక్షుడి మార్పు, పార్టీలో పదవులు ఇవ్వట్లేదని అసంతృప్తులు ఎక్కువ కావడం, నేతలు పార్టీకి గుడ్ బై చెబుతుండటం ఇలా వరుస పరిణామాల నేపథ్యంలో.. బూస్ట్ ఇచ్చేందుకు అగ్రనాయకత్వం రంగం సిద్ధం చేసింది. బీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అనేలా ఉన్న బీజేపీకి మునుపటి పరిస్థితులు తీసుకురావడానికి కమలనాథులు ‘దూకుడు’ పెంచారు. ఇక బీఆర్ఎస్‌పై తగ్గేదేలా అని.. అధికార పార్టీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యే భరతం పట్టాలని ఫిక్స్ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంతకీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ అగ్రనాయకత్వం రచించిన వ్యూహాలేంటి..? ఎలా ముందుకెళ్తోందనే విషయాలు ఈ కథనంలో చూద్దాం..
ఇదీ అసలు సంగతి..
గులాబీ బాస్ కేసీఆర్‌ను (CM KCR) ఎట్టి పరిస్థితుల్లో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రానివ్వకూడదని రాష్ట్ర, కేంద్ర బీజేపీ నాయకత్వం చేయాల్సిన ప్రయత్నాలు చేస్తోంది. లోలోపల బీఆర్ఎస్-బీజేపీ (BRS-BJP) మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయనేది పక్కనెడితే.. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం దూకుడు మీదున్నారు. ఈ మధ్య బీజేపీలో కాస్త గందరగోళం నెలకొనడంతో జనాల్లోకి మరింత దూసుకెళ్లి.. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు వైఫల్యాలను ఎండగట్టాలని గట్టిగానే డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే జూన్-15న ఖమ్మంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మించి భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావించింది అధిష్టానం. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సభ జరగలేదు. దీంతో దూకుడు పెంచిన బీజేపీ.. జూలై-29న అదే ఖమ్మం (Khammam) గడ్డపై సభ నిర్వహించాలని ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) విచ్చేయనున్నారు. సభకు ముహూర్తం ఖరారు కావడంతో ఢిల్లీ నుంచి రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలొచ్చాయి. ఇదే ఖమ్మం గడ్డపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నిర్వహించిన బహిరంగ సభలు ఊహించిన దానికంటే ఎక్కువే విజయవంతం అయ్యాయి. దీంతో ఆ రెండు పార్టీలను మించి సభ నిర్వహించాలని.. భారీగా జనసమీకరణ చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ సభావేదికగా కేసీఆర్ సర్కార్ (KCR Govt) అవినీతిని అమిత్ షా బయటపెట్టనున్నారని తెలియవచ్చింది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం నుంచి వచ్చిన కొన్ని నివేదికలను నిశితంగా షా పరిశీలించినట్లు సమాచారం. దీంతో ఇక బీఆర్ఎస్‌పై తగ్గేదేలేదని.. దూసుకెళ్లాల్సిందేనని కమలనాథులు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
ఇక వరుస పర్యటనలు..
ఇదిలా ఉంటే.. ఆగస్ట్-15 తర్వాత తెలంగాణలో బీజేపీ పాలిత రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పర్యటించనున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో 119 మంది ఎమ్మెల్యేలు పర్యటించబోతున్నట్లు రాష్ట్ర బీజేపీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే.. ఈ పర్యటన చాలా వ్యూహాత్మకంగా ఉంటుందని స్పష్టమవుతోంది. ఎందుకంటే.. బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలను ఆర్టీఐ (RTI) ద్వారా సమాచారం సేకరించాలని బీజేపీ నిర్ణయించింది. ఆ డేటాతో నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలు పర్యటించినప్పుడు ఆయా బీఆర్ఎస్ నేత చిట్టా తీయబోతున్నారు కమలనాథులు. ఇలా వారి ఆస్తులు, అవినీతిని ప్రజల ముందు ఉంచితే ఎవర్ని నమ్మాలనేదానిపై ఓ నిర్ణయానికొస్తారని కమలనాథులు ఓ అభిప్రాయానికి వచ్చారు.
మొత్తానికి చూస్తే.. అటు అమిత్ షా పర్యటన, ఇటు వరుసగా 119 మంది ఎమ్మెల్యేల పర్యటనతో పక్కా వ్యూహంతోనే అగ్రనాయకత్వం రాష్ట్రంలోకి అడుగుపెడుతోంది. అసలే అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను పక్కనెట్టి కిషన్ రెడ్డికి పదవి కట్టబెట్టాక కాస్త స్థబత నెలకొంది. మరోవైపు.. కొందరు నేతలు ఎప్పుడు కమలం పార్టీని కారెక్కుతారో.. ‘చేయి’ నీడకు చేరతారో తెలియని పరిస్థితి. ఎమ్మెల్యే, చేరికల కమిటి చైర్మన్ ఈటల రాజేందర్ నేతలను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర పర్యటనకు వస్తున్న అమిత్ షా, బీజేపీ ఎమ్మెల్యేల ఏం చేయబోతున్నారు..? కమలనాథుల ప్లాన్ ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి మరి.