BRS KCR : తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడో ఒకే ఒక్క మాటలో తేల్చేసిన సీఎం కేసీఆర్..
ABN , First Publish Date - 2023-03-10T17:05:23+05:30 IST
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు (TS Early Elections) వస్తాయని.. అతి త్వరలోనే జరగబోతున్నాయంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు (TS Early Elections) వస్తాయని.. అతి త్వరలోనే జరగబోతున్నాయంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. సీఎం కేసీఆర్ (CM KCR) కూడా ఇదే ఆలోచనలో ఉన్నారని త్వరలోనే తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్తారని కూడా ప్రచారం జరిగింది. దీనిపై బీఆర్ఎస్ (BRS) నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై స్వయంగా కేసీఆరే రియాక్టయ్యి ఒకే ఒక్క మాటతో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ముందస్తు ముచ్చటే లేదు.
‘తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. ముందస్తు ముచ్చటే లేదు. డిసెంబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయి.. దాని ప్రకరామే ప్లాన్ చేసుకోండి. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించుకోవాలి. సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించండి. కచ్చితంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది. ఏప్రిల్-27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఉంటుంది’ అని సమావేశంలో నేతలకు కేసీఆర్ క్లియర్‌కట్‌గా చెప్పేశారు. మొత్తానికి చూస్తే చాలా రోజులుగా ముందస్తు ఎన్నికలపై వస్తున్న ప్రచారాన్ని ఒక్క మాటతో కేసీఆర్ తిప్పికొట్టారు. అంతేకాదు.. ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ సూచించారు. నేతలంతా నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజా సమస్యలను పరిష్కారించాలని కేసీఆర్ కీలక సూచనలు చేశారు. ఇక నుంచి నేతలంతా ప్రజల్లోనే ఉండాలని.. అవసరమైతే పాదయాత్రలు కూడా చేసుకోవాలని నేతలకు గులాబీ బాస్ సలహా ఇచ్చారు.
ఇలా కూడా ప్రచారం..!
వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆరోపణలు వచ్చాక ఈ రాజకీయ వాతావరణం మరింత రంజుగా మారింది. కవిత ఈడీ విచారణ (Kavitha ED enquiry), అరెస్ట్ ఊహాగానాలతో త్వరలోనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లొచ్చనే ప్రచారం ఓ రేంజ్‌లో జరిగింది. ముఖ్యంగా.. కేసీఆర్ గురువారం నాడు హఠాత్తుగా క్యాబినెట్ భేటీ నిర్వహించడం, మరుసటి రోజు శుక్రవారమే బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి పిలుపునివ్వడం ఈ ఊహాగానాలకు ప్రధాన కారణమైంది. కవితను అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయని, అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే సానుకూల ప్రభావం ఉంటుందని, అందుకు తగిన సమయం ఇదేననేది విశ్లేషణలు, ఊహాగానాల సారాంశం.
మొత్తానికి చూస్తే.. ఇన్ని రోజులుగా చిత్రవిచిత్రాలుగా వచ్చిన రూమర్స్‌కు కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇదంతా కేసీఆర్ వ్యూహంలో భాగమేనని కూడా రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. కచ్చితంగా ప్రతిపక్షాల ఊహకందని రీతిలో కేసీఆర్ నిర్ణయం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయో వేచి చూడాల్సిందే మరి.