BJP: లీడర్ల తీరుతో క్యాడర్‌లో అయోమయం..ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహారం..!

ABN , First Publish Date - 2023-03-07T12:54:01+05:30 IST

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరింత వేగం పెంచుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ..

BJP: లీడర్ల తీరుతో క్యాడర్‌లో అయోమయం..ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహారం..!

సంగారెడ్డి జిల్లాలోని ఆ నియోజకవర్గ బీజేపీకి వర్గపోరు ఇబ్బందిగా మారుతోంది. ఇద్దరు కీలక నేతల మధ్య జరుగుతున్న టిక్కెట్‌ ఫైట్‌ హీట్‌ పెంచుతోంది. పార్టీ కార్యక్రమాలు కూడా వేర్వేరుగా నిర్వహిస్తుండడంతో క్యాడర్‌ కన్‌ఫ్యూజ్‌ అవుతోంది. కీలక నేతలు ఎవరికివారే యుమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నా అధిష్టానం దృష్టి సారించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకీ.. ఏంటా నియోజకవర్గం?.. టిక్కెట్‌ కోసం కొట్లాడుతున్న ఆ ఇద్దరు నేతలెవరు?.. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-2754.jpg

పటాన్‌చెరులో కీలక నేతల మధ్య వర్గపోరు

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరింత వేగం పెంచుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. దానికి తగ్గట్లే.. కేంద్ర అధినాయకత్వం.. తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. జాతీయస్థాయి నేతలు, కేంద్రమంత్రులు.. తరుచూ జిల్లాల్లో పర్యటిస్తూ బీజేపీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో మాత్రం కీలక నేతల మధ్య వర్గపోరు పార్టీకి ఇబ్బందిగా మారింది. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్, జాతీయ కౌన్సిల్ మాజీ సభ్యులు, ఎస్‌ఆర్ ట్రస్ట్‌ చైర్మన్ అంజిరెడ్డి దంపతుల మధ్య సఖ్యత కొరవడింది. కలిసి ముందుకు సాగుతూ పార్టీని పటిష్టం చేయాల్సిన తరుణంలో.. ఇరువురు ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తుండడంతో క్యాడర్ అయోమయానికి గురవుతోంది.

Untitled-31555.jpg

ఏం చేయాలో అర్థం కాక క్యాడర్ సతమతం

ఇదిలావుంటే.. వచ్చే ఎన్నికల్లో తమకే టిక్కెట్ వస్తుందని.. అటు నందీశ్వర్‌గౌడ్‌, ఇటు అంజిరెడ్డి.. ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలు, అధికార పార్టీని ఎదుర్కోవడంలో చూపాల్సిన ఐక్యత ఎక్కడా కనబడడం లేదు. కీలక నేతలు తలో దారిలో వెళ్తుంటే.. ఏం చేయాలో అర్థం కాక క్యాడర్ సతమతమవుతోంది. మాజీ ఎమ్మెల్యేగా టిక్కెట్ రావడం ఖాయమని నందీశ్వర్‌గౌడ్ ధీమా వ్యక్తం చేస్తుండగా.. గతంలో ఆయన కుమారుడు, బీజేవైఎం నేత పలు వివాదాల్లో ఇరుక్కోవడం మైనస్‌గా మారింది. గతంలోనూ నందీశ్వర్‌కు రాజకీయంగా సన్‌స్ట్రోక్ తగిలిన సందర్భాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే.. నందీశ్వర్, అతని కుమారుడు వ్యవహార శైలితో పార్టీకి నష్టం జరుగుతోందని వ్యతిరేకవర్గం ఆరోపిస్తోంది.

Untitled-2954.jpg

కలిసి పనిచేస్తే గెలుపు ఖాయమంటున్న క్యాడర్‌

ఇక.. గోదావరి, అంజిరెడ్డి దంపతులు పార్టీతోపాటు.. ట్రస్టు ద్వారా సేవా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అంజిరెడ్డి దంపతులు వివాదరహితులుగా పేరు తెచ్చుకున్నారు. అంజిరెడ్డి, ఆయన సతీమణి, మహిళా మోర్చా నాయకురాలు గోదావరి చురుగ్గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటు.. నందీశ్వర్‌గౌడ్, ఆయన కుమారుడు ఆశిష్‌గౌడ్‌ కూడా పటాన్‌చెరు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతో.. కార్యక్రమాల నిర్వహణలోనూ పటాన్‌చెరులో వర్గపోరు స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు.. నందీశ్వర్, అంజిరెడ్డి.. ఎవరికివారు టిక్కెట్‌పై ప్రచారం చేసుకోవడమూ చర్చగా మారుతోంది. అయితే.. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. కీలక నేతల మధ్య విభేదాలు పార్టీకి నష్టం చేస్తాయని కమలం పార్టీ క్యాడర్ కంగారు పడుతోంది. ఇరువర్గాలు మారకుంటే.. మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. నియోజకవర్గంలోని కీలక నేతలు కలిసికట్టుగా ముందుకు సాగితే.. వచ్చే ఎన్నికల్లో పటాన్‌చెరులో కాషాయ జెండా ఎగరడం ఖాయమని పార్టీ శ్రేణులు అశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Untitled-28544.jpg

మొత్తంగా.. ఓ వైపు తెలంగాణలో అధికారమే లక్ష్యం అధిష్టానం దూకుడుగా వ్యవహరిస్తుంటే.. నియోజకవర్గాల్లోని సీన్లు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. ప్రధానంగా.. హైదరాబాద్‌ నగరానికి అనుకుని ఉన్న పటాన్‌చెరు బీజేపీలోనూ వర్గపోరు ఇబ్బందిగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఆయా పరిణామాలు క్యాడర్‌ను తెగ కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇప్పటికైనా.. పటాన్‌చెరు కమలం పార్టీ నేతలు.. భేదాభిప్రాయాలు పక్కనపెట్టి ముందుకు సాగుతారో లేదో చూడాలి మరి.

Updated Date - 2023-03-07T12:54:01+05:30 IST