Congress And Communists : తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణలు.. కమ్యూనిస్టులకు కాంగ్రెస్ బంపరాఫర్.. అంతా ఓకేగానీ..!?
ABN , First Publish Date - 2023-08-27T17:14:15+05:30 IST
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను (CM KCR) నమ్మిన పాపానికి వామపక్షాలను (Left Parties) నిలువునా ముంచేశారు.!. అదేదో సామెత ఉంది కదా.. ఏరు దాటాక.. అన్నట్లుగా మునుగోడు ఉప ఎన్నిక (Munugodu By Elections) సమయంలో స్నేహగీతం ఆలపించిన బీఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీలు (BRS, CPI, CPM) ఎంతో కాలం చెలిమిని కొనసాగించలేకపోయాయి...
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను (CM KCR) నమ్మిన పాపానికి వామపక్షాలను (Left Parties) నిలువునా ముంచేశారు.!. అదేదో సామెత ఉంది కదా.. ఏరు దాటాక.. అన్నట్లుగా మునుగోడు ఉప ఎన్నిక (Munugodu By Elections) సమయంలో స్నేహగీతం ఆలపించిన బీఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీలు (BRS, CPI, CPM) ఎంతో కాలం చెలిమిని కొనసాగించలేకపోయాయి. సొంత పార్టీ నేతలే కాకుండా కేసీఆర్ హామీలను వామపక్ష పార్టీలు సైతం విశ్వసించాయి. వచ్చే ఎన్నికలకు కేసీఆర్ ప్రకటించిన జాబితాలో (BRS First List) కామ్రేడ్లు కోరిన సీట్లు కూడా ఉండడంతో కమ్యూనిస్టులతో పొత్తు లేదని చెప్పకనే చెప్పినట్లయింది. తమను ఒక్క మాట కూడా సంప్రదించకుండా కేసీఆర్ సీట్లు ప్రకటించడంపై కామ్రెడ్లు ఫైర్ అవుతున్నారు. తాము ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తామని కమ్యూనిస్టులు ప్రకటించారు. మరోవైపు.. కేసీఆర్ జాబితా ప్రకటించిన నాటి నుంచి మిత్రద్రోహానికి పాల్పడ్డారని వామపక్షాలు రగిలిపోతూనే ఉన్నాయి. మరోవైపు కమ్యూనిస్టులే ఇక్కడ తమతో పొత్తు పెట్టుకుని, జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమిలోనూ (INDIA) చేరి వారే మిత్రద్రోహానికి పాల్పడ్డారని బీఆర్‌ఎస్ వాదిస్తోంది. ఏతావాతా.. కేసీఆర్‌ను నమ్మి మోసపోయామని కమ్యూనిస్టులు గ్రహించారు. భవిష్యత్తు రాజకీయ ప్రయాణంపై కీలక చర్చలు జరుపుతున్నారు. సరిగ్గా ఈ క్రమంలోనే కేసీఆర్ పక్కనెట్టిన కమ్యూనిస్టులకు కాంగ్రెస్ వల వేస్తోంది.
ఏం జరుగుతోంది..?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు (Telangana Politics) వేగంగా మారుతున్నాయి. ఉభయ కమ్యూనిస్టు ముఖ్య నేతలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే (Manikrao Thakre) ఫోన్ చేసి మాట్లాడారు. కేసీఆర్‌ను ఓడించడానికి కాంగ్రెస్-కమ్యూనిస్టులు కలిసి ముందుకెళ్దామని కోరారు. ఇది ఒకరకంగా కమ్యూనిస్టులకు బంపరాఫరే అని మారుమాట చెప్పకుండా ముందుకెళ్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు.. ఆదివారం నాడు సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగ్గా.. కాంగ్రెస్‌తో పొత్తుపై కీలకంగా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే సీపీఐ, సీపీఎం కలిసి పోటీచేయాలని నిర్ణయించుకోవడం.. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఆఫర్ రావడంతో ఇప్పుడిదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటు కాంగ్రెస్ కీలక నేతలు కూడా.. కామ్రేడ్లతో జతకడితే.. ఎక్కడెక్కడ మంచి ఫలితం ఉంటుంది..? పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు.. ఏయే జిల్లాల నుంచి ఎన్ని ఇవ్వొచ్చు..? కమ్యూనిస్టుల బలమెంత..? అని కాంగ్రెస్ అధినాయకత్వం.. తెలంగాణ కాంగ్రెస్ నేతలను అడిగి తెలుసుకున్నట్లు భోగట్టా. అయితే.. కమ్యూనిస్టులతో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలు సహా పలు నియోజకవర్గాల్లో పట్టున్నట్లు తేలింది. దీంతో కమ్యూనిస్టులతో కలిసి అడుగేయడం మంచిదనేని.. ఇక ఆలోచించాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి కాంగ్రెస్ పెద్దలు వచ్చినట్లు తెలియవచ్చింది.
పొత్తులపై ఏమన్నారంటే..?
రెండు మూడ్రోజులుగా పొత్తులపై చర్చిస్తూనే ఉన్న కమ్యూనిస్టులు ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు. కాంగ్రెస్‌తో పొత్తులపై చర్చించిన మాట వాస్తవమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) స్పష్టం చేశారు. ‘కమ్యూనిస్టుల గౌరవానికి భంగం కలుగకుండా ఉంటే కాంగ్రెస్‌తో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టాం. మా ప్రతిపాదనలకు కాంగ్రెస్ అంగీకరిస్తేనే పొత్తులకు సై. పొత్తులపై మేం ఏ నిర్ణయం తీసుకోవాలన్న CPMను సంప్రదించాకే తుది నిర్ణయం ప్రకటిస్తాం. కాంగ్రెస్‌తో కలిసినా, కలవకున్నా.. CPMతో కలిసే వెళ్తాం’ అని కూనంనేని క్లారిటీ ఇచ్చుకున్నారు. మరోవైపు.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) కూడా స్పందించారు. ‘పొత్తులపై తొందర పడాల్సిన అవసరం లేదని సీపీఎం నిర్ణయించింది. బీఆర్ఎస్ పొత్తు ధర్మం పాటించలేదు. బీజేపీకి బీఆర్ఎస్ దగ్గరవుతోంది. కాంగ్రెస్ నుంచి నిర్దిష్ట ప్రతిపాదనలు వస్తేనే చర్చలు చేస్తాం.. పొత్తులపై ఏం చేయాలనే దానిపై సీపీఐతో కలిసే ఆలోచన చేస్తాం’ అని తమ్మినేని చెప్పారు. సో.. అటు సీపీఐ, ఇటు సీపీఎం నేతలు ఇద్దరూ ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే క్లారిటీ వచ్చేస్తుందన్న మాట.
కామ్రేడ్స్‌కు ఏం కావాలి.. కాంగ్రెస్ ఏమంటోంది..?
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తమకు నాలుగు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మునుగోడు, హుస్నాబాద్, బెల్లంపల్లి, కొత్తగూడెం స్థానాలను కామ్రేడ్ అడిగేందుకు సిద్ధంగా ఉన్నారట. అయితే.. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం మునుగోడు, హుస్నాబాద్ సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఒక ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలియవచ్చింది. కనీసం మూడు స్థానాలను కేటాయిస్తే పొత్తుకు సిద్ధంగా ఉన్నామని.. వామపక్షాలు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఫైనల్‌గా ఎవరికీ నష్టం జరగకుండా సీట్ల సర్దుబాటుకి ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ హైమాండ్ ఢిల్లీ నుంచి ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. చివరికి పొత్తులపై ఏం జరుగుతుందో చూడాలి మరి.