Jagan London Tour: 43 అంటే అంత ఎమోషన్ ఎందుకు? పెత్తందారులెవరు సారూ?

ABN , First Publish Date - 2023-09-08T16:22:10+05:30 IST

ప్రత్యేక ఛార్టెడ్ విమానంలో.. రూ.43 కోట్ల సొమ్ము ఖర్చుపెట్టి సీఎం జగన్ లండన్ వెళ్లాల్సిన అవసరమేంటని ఇప్పుడు ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒకటో తేదీ దాటి వారం గడిచినా రాష్ట్రంలో టీచర్లు, 108 ఉద్యోగులు, 104 ఉద్యోగులు, పెన్షనర్లు జీతాలు లేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం ప్రతి నెలా రిజర్వు బ్యాంకు నుంచి అప్పు తెచ్చి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి. సీఎం సారు మాత్రం ఖరీదైన విమానాల్లో విదేశీ పర్యటనలు చేస్తున్నారంటూ ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Jagan London Tour: 43 అంటే అంత ఎమోషన్ ఎందుకు? పెత్తందారులెవరు సారూ?

జగన్ లండన్ పర్యటన గురించి చెప్పుకునే ముందు ఒక విషయం గురించి చెప్పాలి. జగన్ నిరుపేద ముఖ్యమంత్రా అంటే కానే కాదని అందరూ ముక్తకంఠంతో చెప్తారు. తండ్రి అధికారంలో ఉండగా అక్రమ మార్గాల్లో రూ.43వేల కోట్లు దోచుకున్నారు. ఇదే అంశంపై 10 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపారు. అయినా ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలు అవకాశం ఇస్తే.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అభివృద్ధి అనే నామరూపం లేకుండా కుక్కలు చింపిన విస్తరి చేశారు. నాలుగున్నరేళ్ల కాలంలో రాజధాని లేని రాష్ట్రాన్ని పాలించిన ఏకైక సీఎంగా రికార్డు సాధించారు. ఒకవైపు తనపై సీబీఐ ఆంక్షలు ఉన్నా ప్రత్యేకంగా కోర్టు అనుమతి తీసుకుని ఏపీ సీఎం జగన్ భార్య భారతితో సహా లండన్ పర్యటనకు వెళ్లారు. కుమార్తెను చూసేందుకు పదిరోజుల పాటు లండన్ వెళ్తున్నట్లు కోర్టుకు వెల్లడించారు.

ఇదంతా బాగానే ఉంది. కానీ ప్రత్యేక ఛార్టెడ్ విమానంలో.. రూ.43 కోట్ల సొమ్ము ఖర్చుపెట్టి సీఎం జగన్ లండన్ వెళ్లాల్సిన అవసరమేంటని ఇప్పుడు ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒకటో తేదీ దాటి వారం గడిచినా రాష్ట్రంలో టీచర్లు, 108 ఉద్యోగులు, 104 ఉద్యోగులు, పెన్షనర్లు జీతాలు లేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం ప్రతి నెలా రిజర్వు బ్యాంకు నుంచి అప్పు తెచ్చి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఈనెల ఇంకా అప్పు పుట్టలేదు. ఇంకా ఉద్యోగులకు జీతాలు వేయలేదు. సీఎం సారు మాత్రం ఖరీదైన విమానాల్లో విదేశీ పర్యటనలు చేస్తున్నారంటూ ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే డబ్బు ప్రజల కోసం ఖర్చుపెడితే వచ్చిన నష్టమేంటని నిలదీస్తున్నారు. జీతాలు ఇవ్వమని అడిగితే నిధులు లేవని చెప్పే వైసీపీ నేతలు ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని పలువురు ఎద్దేవా చేస్తున్నారు


ఏపీలోని ప్రధాన ప్రతిపక్షాలు ఇదే అంశంపై నిలదీస్తే.. జగన్ లండన్ పర్యటన వ్యక్తిగతం అంటూ వైసీపీ వాళ్లే వివరణ ఇస్తున్నారు. మరి వ్యక్తిగత పర్యటనలకు ప్రభుత్వ ధనం ఎలా ఖర్చుపెడతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత పర్యటన అయితే గన్నవరం విమానాశ్రయానికి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు వచ్చి సలాంలు చేయాల్సిన అవసరం ఏముందని నిలదీస్తున్నారు. గతంలో కూడా విదేశీ పర్యటనలకు ప్రత్యేక జీవోల ద్వారా నిధులు కేటాయించిన విషయాన్ని పలువురు గుర్తుచేస్తున్నారు. మరోవైపు జగన్ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయని.. ఆయన వ్యక్తిగత పర్యటన కోసం ఆ డబ్బు ఖర్చుపెట్టకూడదా అన్న రేంజ్‌లో వైసీపీ నేతలు నీతులు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు సీఎం జగన్ ఇటీవల పదేపదే పెత్తందార్లు అని ప్రతిపక్ష నేతలను, మీడియా అధినేతలను ఆడిపోసుకోవడం ఎందుకు అని నెటిజన్‌లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. పేదవాడు ఒకవైపు.. పెత్తందారులు ఒకవైపు అంటూ తన ప్రతి ప్రసంగంలో జగన్ ఊదరగొడుతున్నారని.. అసలు పెత్తందారుడు ఎవరో తమకు తెలుసు అని సోషల్ మీడియాలో నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి ప్రజలపై పెను భారం మోపి ప్రజల ధనంతో సీఎం జగన్ మాత్రం భార్యతో సహా విదేశీ పర్యటనలు చేయడం సమంజసమేనా అని నిలదీస్తున్నారు.

Updated Date - 2023-09-08T16:27:25+05:30 IST