Kavitha ED Enquiry : ఉదయం నుంచి ఢిల్లీలో నరాలు తెగే ఉత్కంఠ.. ఫైనల్‌గా ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈడీ నిర్ణయం ఇదీ..
ABN , First Publish Date - 2023-03-16T14:47:13+05:30 IST
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (BRS MLC Kavitha) మరోసారి ఈడీ నోటీసులు (ED Notice) జారీ చేసింది. ఈనెల 20న ఈడీ ఎదుట విచారణకు రావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులు అందుకున్న తర్వాత కవిత నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. వాస్తవానికి ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ కవిత వెళ్లలేదు. అనారోగ్య కారణాల రీత్యా హాజరుకాలేనని తన న్యాయవాది సోమా భరత్ ద్వారా ఈడీ అధికారులకు సమాచారం పంపారు. అయితే కవిత రెక్వెస్ట్‌ను ఈడీ అధికారులు అంగీకరించలేదు. చివరికి.. మరో తేదీని నిర్ణయించి కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా.. ఈడీ విచారణకు రాకపోవడంతో అధికారులు దూకుడు పెంచి.. కోర్టులో కవిత అరెస్ట్‌కు వారంట్ తీసుకునే యోచనలో ఉన్నట్లు మొదట వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఊహించని రీతిలో మరోసారి కవితకు నోటీసులు జారీచేసింది. ఇలా ఉదయం నుంచి అంతా హస్తిన వేదికగా పెద్ద హైడ్రామానే నడిచింది.
కాగా.. 24న సుప్రీం తీర్పు ఉన్నందను ఆ తర్వాతే విచారణకు వస్తానని ఈడీకి కవిత తెలిపారు. కానీ సుప్రీం విచారణకు ముందే ఈడీ ఎదుట హాజరుకావాలని నోటీసులు ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే.. అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీ ముగిసింది. పిళ్లైని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. పిళ్లై కస్టడీ పొడిగించాలని ఈడీ అధికారులు కోరారు.
మరోవైపు.. ఈ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (Ysrcp Mp Magunta Srinivasulu Reddy)కి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 18న విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు (ED) ఆదేశించారు. ఇప్పటికే ఈ కేసులో మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా ఎంపీ మాగుంటకు కూడా తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని ఈడీ అరెస్ట్ చేసింది.