Delhi Liquor Case : విచారణలో వేగం పెంచిన ఈడీ.. ఉదయం నుంచి బుచ్చిబాబుపై ప్రశ్నల వర్షం.. నెక్స్ట్ ఎవరు..!?
ABN , First Publish Date - 2023-09-06T19:05:35+05:30 IST
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam Case) కేసు మళ్లీ మొదటికి వచ్చింది. ఈ కేసును వీలైనంత త్వరలో కొలిక్కి తీసుకుని రవాలని భావిస్తున్న దర్యాప్తు సంస్థలు విచారణలో వేగం పెంచాయి..
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam Case) కేసు మళ్లీ మొదటికి వచ్చింది. ఈ కేసును వీలైనంత త్వరలో కొలిక్కి తీసుకుని రవాలని భావిస్తున్న దర్యాప్తు సంస్థలు విచారణలో వేగం పెంచాయి. ఈ కేసులో తెలంగాణకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్, సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును మరోసారి ఈడీ (Enforcement Directorate) విచారిస్తోంది. ఆడిటర్ బుచ్చిబాబును (Auditor Buchibabu) విచారణకు పిలిపించిన ఈడీ అధికారులు బుధవారం ఉదయం నుంచి రాత్రి 6.15 గంటల వరకూ ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా.. ఈ కేసు విచారణలో బుచ్చిబాబు వాంగ్మూలం అత్యంత కీలకంగా మారబోతోందని నిపుణులు చెబుతున్నారు. గత వారంలో ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు తెలుగువారిని పిలిపించి ఈడీ ప్రశ్నించిన విషయం విదితమే.
నెక్స్ట్ ఎవరు..?
బుచ్చిబాబు తర్వాత ఈడీ ఎవర్ని విచారణకు పిలుస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కచ్చితంగా అతి త్వరలోనే కవితకు (BRS MLC Kavitha) ఈడీ నుంచి నోటీసులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే.. ఈడీ, సీబీఐ విచారించిన జాబితాలో ఆ మధ్య కవిత పేరు లేకపోవడంతో క్లీన్ చిట్ వచ్చినట్లేనని వార్తలు గుప్పుమన్నాయి. ఇందుకు కారణం బీజేపీతో బీఆర్ఎస్ రహస్య ఒప్పందేమేననే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తునే వచ్చాయి. అయితే.. ఈ ఛార్జ్‌షీట్‌లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, అర్జున్ పాండే, అమనాదీప్ ధల్‌లపై అభియోగాలు మోపుతూ సీబీఐ పేర్కొంది. కానీ.. ఛార్జ్‌షీట్‌లో కవిత పేరు ఎక్కడా కనిపించలేదు. కవిత విషయంలో దర్యాప్తు సంస్థల దగ్గర స్పష్టమైన ఆధారాలు లేవా..? లేకుంటే మరేదైనా కారణమా..? అని అప్పట్లో ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తునే చర్చలు నడిచాయి. ఇంతవరకూ ఈ వ్యవహారంపై కవితగానీ.. బీఆర్ఎస్ నేతలు కానీ స్పందించలేదు. తాజాగా బుచ్చిబాబును విచారణకు పిలవడంతో బీఆర్ఎస్ వర్గాల్లో కలవరం మొదలైనట్లు తెలుస్తోంది.
బుచ్చిబాబుదే కీలక పాత్ర!
గతంలో కూడా సీబీఐ, ఈడీ బుచ్చిబాబును పలుమార్లు ప్రశ్నించాయి. ఢిల్లీ ఎక్సైజ్ విధానం రూపకల్పన, అమలులో బుచ్చిబాబు కీలక పాత్ర పోషించారని, దాని వల్ల హైదరాబాద్‌కు చెందిన హోల్ సేల్, రిటైల్ లైసెన్సీలకు, వారి ద్వారా ప్రయోజనం పొందిన వారికి అక్రమ లాభాలు సమకూరాయని సీబీఐ ఒక ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే. కవిత జాగృతి సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచీ ఆమె ఆడిటర్‌గా ఉన్న బుచ్చిబాబు.. మంత్రి కేటీఆర్‌కు, ఆయన సన్నిహిత నేతలకు కూడా ఆడిటర్‌గా పనిచేశారు. 2022, అక్టోబర్-08, నవంబర్ 20 తేదీల్లో మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50(2),(3) క్రింద బుచ్చిబాబు నుంచి ఇప్పటికే సమాచారం తీసుకున్నామని ఈడీ గత నెలలో దాఖలు చేసిన చార్జిషీటులో పేర్కొంది. బుచ్చిబాబు ఈడీకి తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ మద్యం పాలసీ ముసాయిదా ప్రతిని రూపొందించడం నుంచి శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డిని మద్యం వ్యాపారంలో ప్రవేశపెట్టేంతవరకూ ఆయన కీలక పాత్ర పోషించారు. 2021 జూన్‌లో బుచ్చిబాబు.. అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లైతో కలిసి న్యూఢిల్లీలోని విజయగౌరి అపార్ట్‌మెంట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్ నాయర్‌తో చర్చలు జరిపారు. తర్వాత ఐటీసీ కోహినూర్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి నివాసం, తాజ్‌మన్‌సింగ్ హోటల్, ఒబెరాయ్ హోటల్ తదితర ప్రాంతాల్లో జరిగిన కీలక సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. ఇన్ని ఆధారాలు ఉండటం, కేసులో బుచ్చిబాబు వాంగ్మూలం కీలకం అవుతుండటంతో ఇప్పుడే అసలు సీన్ మొదలైందని.. మున్ముందు ఇంకా చాలా వరకూ వెళ్తుందని నిపుణులు చెబుతున్నారు.